25 June, 2026 | 3:12 AM

ఎల్లమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి

25-06-2026 02:04 AM

నల్లగొండ, జూన్ 24 (విజయక్రాంతి): జిల్లాలోని కనగల్ మండలం ధర్వేశిపురం (ధర్మేశ్వరం) శ్రీ రేణుక ఎల్లమ్మ బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారి కళ్యాణోత్సవం సందర్భంగా దేవాలయం నుంచి కళ్యాణ మండపం వరకు మేళతాళాల నడుమ వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించి శ్రీ రేణుక ఎల్లమ్మ - జమదగ్ని మహర్షి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు.

అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి ఆయన మాట్లాడుతూ ధర్వేశిపురం ఎల్లమ్మ ఆలయాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన దేవాలయంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఇందులో భాగంగానే రూ.50 కోట్ల కేంద్ర రహదారుల నిధులతో నల్లగొండ నుంచి ధర్వేశిపురం వరకు నూతన రహదారి నిర్మాణానికి టెండర్లు పూర్తయి పనులు ప్రారంభమవుతున్నట్లు ప్రకటించారు.