25 June, 2026 | 2:45 AM

ఎటు చూసినా శిథిలాలే..

25-06-2026 01:31 AM

కేసముద్రంలో పెరుగుతున్న నిర్వాసితుల సంఖ్య

అగమ్య గోచరంగా అభివృద్ధి పనులు

కేసముద్రం, జూన్ 24 (విజయక్రాంతి): కేసముద్రం పట్టణ అభివృద్ధి మాట దేవుడెరుగు.. ఇప్పుడు సెట్ బ్యాక్ పేరుతో అనేక మంది ఇండ్లు కూల్చివేతలకు గురికావడం, చాలామంది చిరు వ్యాపారులు తమకు ఉపాధి ఇచ్చే గుడు కోల్పోయి నిర్వాసితులుగా మారుతున్నారు. ఈ సంఖ్య ఇటీవల మరింత పెరిగిపోయింది.

కేసముద్రం వ్యవసాయ మార్కెట్ వద్ద సుమారు 50 మంది, ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద మరో 15 మందిలో ప్రభుత్వ స్థలాల్లో గుంచీలు వేసుకొని కొందరు, మార్కెట్ వద్ద పక్క నిర్మాణం చేపట్టి ఏళ్ల తరబడిగా ఉపాధి పొందుతున్నారు. ఇందులో అనేకమంది వివిధ వృత్తులను కొనసాగిస్తూ తమ జీవనాన్ని వెల్లదీస్తున్నారు. ఈ క్రమంలో కేసముద్రం పట్టణంలోని పలు ప్రధాన రహదారులను విస్తరించడానికి నిర్ణయించారు. 80 అడుగుల వెడల్పుతో రోడ్లను విస్తరించడానికి గత ఏడాది మార్కింగ్ చేశారు.

విస్తరణకు ప్రతిపాదించిన రహదారుల్లో అనేక చెట్లను పూర్తిగా తొలగించారు. దీనికి తోడు కొందరు విస్తరణలో ఇల్లు కోల్పోయే యజమానులు స్వతహాగా తమ ఇండ్లను తొలగించుకున్నారు. ఇంకొన్నింటినీ మున్సిపల్, ఆర్ అండ్ బి అధికారులు తొలగించారు. ఇక మరి కొంతమంది ప్రస్తుతం తమ ఇళ్ళను సెట్ బ్యాక్ కు అనుగుణంగా తొలగిస్తున్నారు. దీంతో కేసముద్రం పట్టణంలో ఎటు చూసినా శిథిలాలే కనిపిస్తున్నాయి.

అభివృద్ధి మాట దేవుడెరుగు.. ఉన్న ఇళ్లను ఉన్నపలంగా కొంతమేర తొలగించాల్సి వస్తుందడంతో వందల మంది గృహ యజమానులు, షాపుల యజమానులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. 80 అడుగుల రోడ్డు విస్తీర్ణం కోసం స్టేట్ బ్యాంక్ స్థలంలో ఉన్న ఇండ్లను, షాపులను తొలగించడం, మళ్లీ వాటికి మరమ్మతులు నిర్వహించుకోవడం, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, నిర్మాణ మేస్త్రి, ఇలా వారందరి కోసం పోటీ పెరిగిపోయింది.

ఊరంతా ఒక్కసారిగా శిథిలంగా మారి, మరమ్మతులకు పూనుకోవడంతో కేసముద్రం పట్టణమంతా ప్రస్తుతం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కోరుకొండ పల్లి క్రాస్ రోడ్డు నుండి మొదలుకొని అంబేద్కర్ సెంటర్ వరకు, మహాత్మ జ్యోతిబాపూలే సెంటర్ నుండి పొట్టి శ్రీరాములు సర్కిల్ వరకు, ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి మొదలుకొని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వరకు రోడ్ల విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టారు. చాలామంది తమ ఇళ్లను, షాపులను విస్తరణకు అనుగుణంగా తొలగించుకున్నారు. కొందరు తమకు న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్రయించారు. పలుచోట్ల విస్తరణకు అనుకూలంగా ఇండ్లను, షాపులను తొలగించకపోవడంతో ఆటంకంగా మారింది.

దీనితో విస్తరణ పనులు ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా మారిపోయాయి. రోడ్ల విస్తరణ పనులను ఒక్కసారిగా చేపట్టడం, ఇండ్లను తొలగించిన స్థానంలో మరమ్మతులు చేసుకోవాల్సి వస్తుండడంతో అనేకమంది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు ఆయా పనులు నిర్వహించే వారికి డిమాండ్ పెరిగిపోవడంతో వర్షాకాలంలోపు పనులు పూర్తయ్య పరిస్థితి కనిపించడం లేదు. ఇక రోడ్ల విస్తరణ కోసం పనులు చేపట్టిన గుత్తేదారులు డ్రైనేజీ పనులను ఇప్పటికీ చేపట్టలేదు. కేవలం డివైడర్ నిర్మాణ పనులు మాత్రం పూర్తి చేసి, ఇతర పనులను పూర్తిస్థాయిలో నిర్వహించకపోవడంతో కంకర రోడ్లపై నడిచే పరిస్థితి లేకుండా పోయింది. పట్టణమంతా శిథిలంగా మారింది.

డ్రైనేజీ నీరు ముందుకు సాగకుండా ఎక్కడికక్కడే నిలిచిపోతుంది. దుర్వాసన వెదజల్లడంతో పాటు దోమల బెడద కూడా ప్రారంభమైంది. రోడ్ల విస్తరణ పనులు ఇప్పట్లో పూర్తయ్య పరిస్థితి కనిపించడం లేదు. దీనికి తోడు ఇంతకాలం పట్టణంలో వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను ఆసరాగా చేసుకుని వివిధ చేతి వృత్తుల వారు, స్వయం ఉపాధి పొందుతున్న వారు తమకు ఇంతకాలం నిలువ నీడ ఇచ్చిన స్థలాలను విస్తరణ పేరుతో తొలగించి రోడ్లు వేస్తూ.. తమకు ప్రత్యామ్నాయం చూపకపోవడంతో కేసముద్రం పట్టణ అభివృద్ధి.. అగమ్య గోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.