లంపి స్కిన్ నివారణకు టీకాల కార్యక్రమం ప్రారంభం
290 పశువులకు వేసిన వ్యాధి నిరోధక టీకాలు
ఎర్రవల్లి, జూన్ 24: ఎర్రవల్లి, ఇటిక్యాల మండలాల పరిధిలోని అన్ని గ్రామాల్లో పశువులకు సోకే లంపి స్కిన్ (ముద్ద చర్మ వ్యాధి) నివారణ కోసం ప్రత్యేక టీకాల కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం జూన్ 24 నుంచి జూలై 8వ తేదీ వరకు కొనసాగనుంది. లంపి స్కిన్ వ్యాధి ఫాక్స్ జాతికి చెందిన వైరస్ ద్వారా వ్యాపిస్తుందని పశు వైద్య అధికారులు తెలిపారు. వర్షాకాలంలో ఈ వ్యాధి తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున పశువుల యజమానులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వ్యాధి సోకిన పశువుల్లో ఆకలి తగ్గడం, శరీరంపై బొడిపెలు రావడం, గంగడోలు వాపు, ముక్కు, కళ్ల నుంచి స్రావాలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు. కొన్ని సందర్భాల్లో గర్భస్రావం జరిగే ప్రమాదం కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఈ వ్యాధికి ప్రత్యేక చికిత్స అందుబాటులో లేనందున ముందస్తు టీకాలు వేయించుకోవడం ఒక్కటే రక్షణ మార్గమని తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ధర్మవరం, ఇటిక్యాల, సాసనులు గ్రామాల్లో మొత్తం 290 గోజాతి పశువులకు లంపి స్కిన్ వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారి డాక్టర్ భువనేశ్వరి, పశు వైద్య సిబ్బంది మాసోమన్న, కార్తీక్, రాజేంద్రసింహ, శ్రీనివాసులు, శ్రీరాములు, దేవన్న పాల్గొన్నారు.






