13 June, 2026 | 2:16 AM

బీజేపీ చేతిలో ఓటు సీటు చోరీ

13-06-2026 01:05 AM
  1. ఉత్తర కొరియా అధ్యక్షుడు ఆ పార్టీకి ఆదర్శం 
  2. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ పెద్ద కుట్ర
  3. కేటీఆర్ సైగ.. కిషన్‌రెడ్డి డ్యాన్స్ 
  4. ఈటలకు పేరొస్తుందని మల్కాజిగిరి మెట్రో అడ్డగింత
  5. ట్రిపుల్‌ఆర్‌ను సైతం అడ్డుకున్న కిషన్‌రెడ్డి 
  6. క్యాబినెట్ విస్తరణ ప్రచారం ఊహాగానాలే.. 
  7. బీజేపీ నేతలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహం

హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): బీజేపీ చేతిలో ఓటు, సీటు చోరీ జరుగుతోందని, ఆ పార్టీ ఉత్తర కొరియా అధ్యక్షుడిని ఆదర్శంగా తీసుకున్నదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. కిమ్ జాంగ్‌లాగానే బీజేపీ నేతలు ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఉత్తరకొరియాలో ఎన్నికలు జరుగుతాయని, ఫలితాలు మాత్రం అధ్యక్షుడు చెప్పిన విధంగా వస్తాయన్నారు. మధ్యప్రదేశ్ ఎన్నికల పరిణామాలపై బీజేపీ అనుసరించిన విధానంపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

రాజ్యసభ ఎన్నికల్లో మూడో వ్యక్తికి బీజేపీకి నంబర్ లేకపోయినా పోటీకి ఎందుకు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ముమ్మాటికీ కుట్ర పూరిత చర్యేనని ఆరోపించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. తెలంగాణలో మీనాక్షి నటరాజన్‌పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని, అయినప్పటికీ ఆమె నామినేషన్‌ను తిరస్కరించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉన్నదని ఆరోపించారు.

మధ్యప్రదేశ్‌లో రిటర్నింగ్ అధికారి పూర్తిగా తప్పుగా వ్యవహరించారన్నారు. దేశంలో మొదట ఓట్ల చోరీ జరిగింది.. ఇప్పుడు ఏకంగా బీజేపీ నేతలు  సీట్ల చోరీకి పాల్పడుతున్నాని ధ్వజమెత్తారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని వెక్కిరిస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కిషన్‌రెడ్డి రాజీనామా చేయాలి 

రాష్ట్రంలో ప్రాజెక్టు పనులకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డే అడ్డుపడుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధిపై కిషన్‌రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆయన వెంటనే కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి ఆ పదవిని మరొకరికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ కనుసైగ చేస్తే కిషన్‌రెడ్డి డ్యాన్స్ చేస్తున్నారని, ఈటల రాజేందర్‌కు పేరు వస్తుందని మల్కాజ్‌గిరిలో మెట్రో రైల్‌ను అడ్డుకున్నారని ఆరోపించారు.

ప్రాజెక్టుల గురించి చెప్పాలని పలుమార్లు అడిగినా వారి నుంచి స్పందన లేదన్నారు. మోదీకి కిషన్‌రెడ్డి ఇప్పటివరకూ రాష్ట్రంలో ప్రాజెక్టుల పనులపై ఒక్క లేఖ అయినా రాశారా? తెలంగాణకు అనుకూలంగా ఎక్కడైనా మాట్లాడినట్లు నిరూపించాలని సూచించారు. ఐఎఫ్‌ఎస్‌సీ నుంచి నుంచి రావలసిన అప్పును కూడా కిషన్‌రెడ్డే అడ్డుకున్నారని ఆరోపణలు చేశారు. రీజినల్ రింగ్‌రోడ్డును కూడా కిషన్‌రెడ్డినే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

పోలవరం కోసం 4 మండలాలను బీజేపీ ఏపీలో కలిపిందని, అదే తరహాలో తెలంగాణ కోసం మహారాష్ట్ర నుంచి 1500 ఎకరాలు సాధించలేరా అని ప్రశ్నించారు. మహారాష్ట్రను ఒప్పించే వరకు క్యాబినెట్ సమావేశానికి రానని కిషన్‌రెడ్డి, రాజీనామా చేస్తామని 8 మంది బీజేపీ ఎంపీలు చెప్పలేరా? అని ప్రశ్నించారు.

బీజేపీ ఎంపీలు గట్టిగా అడిగితే రాష్ట్రానికి నిధులు వస్తాయి అన్నారు. కానీ 8 మంది బీజేపీ ఎంపీలు రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయడం లేదని విమర్శించారు. మోదీ కౌగిలించుకున్న ఫొటోపై సీఎం స్పందిస్తూ.. ఆయనే ముందుగా తనను ఆలింగనం చేసుకున్నారని తెలిపారు. 

హిట్లర్ ఆదర్శమని చెప్పలేదు

తెలంగాణలో పెద్ద ఎత్తున జరుగుతున్న హిట్లర్ వివాదంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. హైడ్రా అనేది హిట్లర్ కాలంలో ఉండేదని మాత్రమే చెప్పానని స్పష్టం చేశారు. హిట్లర్ తన రోల్ మోడల్ అని ఎక్కడా చెప్పలేదన్నారు. త్వరలోనే  క్యాబినెట్ విస్తరణపై జరుగుతున్న ప్రచారంపైనా సీఎం స్పందించారు.

క్యాబినెట్ విస్తరణ అనేది కేవలం ఊహగానాలు మాత్రమేనని అన్నారు. తమ పార్టీలో 66 మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవులకు అర్హులేనని చెప్పారు. కానీ, రాజ్యాంగం ప్రకారం 17 మందికే మంత్రివర్గంలో ఛాన్స్ ఉందని తెలిపారు. మంత్రివర్గ విస్తరణపై పార్టీ అధిష్టానం వద్ద ఎలాంటి చర్చ జరగలేదని తెలిపారు. 

పవన్‌కళ్యాణ్ తెలంగాణకు రావొచ్చు.. పోవచ్చు

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాన్‌తో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, తెలంగాణలో ఎవరైనా రాజకీయాలు చేయవచ్చని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. జూన్ 2వ తేదీన తెలంగాణలో పవన్ నిర్వహించతలపెట్టిన బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై స్పష్టత ఇచ్చారు. కేవలం శాంతి భద్రతలను పరిగణలోకి తీసుకుని మాత్రమే పోలీసులు ఆ నిర్ణయం తీసుకున్నారని, దీని వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవన్నారు.

తెలంగాణలో పవన్‌కు పూర్తి స్వేచ్ఛ ఉన్నదని, ఆయనకు నచ్చినట్లు రాజకీయాలు చేసుకోవచ్చన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేసుకోవడానికి అర్హులేనని, పవన్‌కళ్యాన్‌తో పాటు ఎవరైనా తెలంగాణలో పోటీ చేయడానికి అర్హులే అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. కానీ లా అండ్ ఆర్డర్ సమస్య తీసుకొస్తానంటే ఒప్పుకునేది లేదన్నారు. ఏపీలో జగన్ సభలకు చాలాసార్లు  అనుమతి ఎందుకు ఇవ్వడం లేదో పవన్ సమాధానం చెప్పాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.