13 June, 2026 | 2:16 AM

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వయోపరిమితి పెంచాలి

13-06-2026 01:05 AM

టీజీపీఎస్సీ చైర్మన్‌కు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల వినతి 

ఎల్బీనగర్, జూన్ 12 : టీజీపీఎస్సీ భర్తీ చేసే ఉద్యోగులకు అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 46 సంవత్సరాలకు పెంచాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులతో కలిసి టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశానికి ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా విడుదలవుతున్న నియామక నోటిఫికేషన్లలో గరిష్ట వయోపరిమితిని  44 నుంచి 46 సంవత్సరాలకు పెంచాలన్నారు.

గతంలో అమలులో ఉన్న జీవో 42 ప్రకారం 46 సంవత్సరాల వరకు వయోపరిమితి ఉండేదని, అనంతరం జారీ చేసిన 86 జీవో ద్వారా 44 సంవత్సరాలకు పరిమితం చేయడంతో అనేక మంది అర్హులైన అభ్యర్థులు అవకాశాలను కోల్పోతున్నారని తెలిపారు.  డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, డిగ్రీ కళాశాల లెక్చరర్ పోస్టులకు సుదీర్ఘ విరామం తర్వాత నోటిఫికేషన్లు వెలువడుతున్నాయని పేర్కొన్నారు.  దరఖాస్తు రుసుమును  రూ.1000 నుంచి రూ.100కు తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో గడ్డిఅన్నారం మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్, వనస్థలిపురం మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖరరెడ్డి, నిరుద్యోగుల జేఏసీ నాయకుడు ఇంద్రా నాయక్ తదితరులు పాల్గొన్నారు.