సభ్యత్వ నమోదు డిజిటల్ విధానంలో చేపట్టాలి
బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకర్తల సమ్మేళనం, సభ్యత్వ నమోదు, ఎస్ఐ అర్ శిక్షణ తరగతుల కార్యక్రమానికి బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు మాజీ జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ కలసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నారదాసు లక్ష్మణ్ రావు మాట్లాడుతూ పార్టీ సభ్యత్వ నమోదు పూర్తిగా డిజిటల్ విధానంలో చేపడుతున్నామని తెలిపారు. సభ్యుల పూర్తి వివరాలు, బ్లడ్ గ్రూప్, చిరునామా తదితర సమాచారం ప్రత్యేక యాప్లో నమోదు చేయనున్నట్లు చెప్పారు. గతంలో పుస్తకాల ద్వారా సభ్యత్వ నమోదు జరగడంతో తప్పుడు నమోదులు జరిగేవని, అందుకే ఇంటింటికీ వెళ్లి సభ్యత్వ నమోదు చేపట్టాలని పార్టీ అధినేత కేసీఆర్ సూచించినట్లు తెలిపారు.
ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, యువత, మహిళలను సభ్యత్వ నమోదు చేయించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ సిద్ధాంతాలు తెలిసిన వారినే సభ్యులుగా చేర్చుకో వాలని సూచించారు. ఎస్ఐఆర్ కార్యక్రమం ద్వారా నిజమైన ఓటర్ల జాబితాను రూపొందించడమే లక్ష్యమని తెలిపారు. మరణించిన వారు, వలస వెళ్లిన వారి వివరాలను గుర్తించి ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయనున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, నెరవేర్చని హామీలను ప్రజల్లో ఎండగడుతూ పోరాటం కొనసాగించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, బూత్‌స్థాయిసభ్యులు పాల్గొన్నారు.






