భూ సర్వే పారదర్శకంగా నిర్వహిస్తాం
రైతులకు న్యాయం చేస్తాం
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
గణపురం,(విజయ క్రాంతి): భూ సర్వే పారదర్శకంగా నిర్వహిస్తామని రైతులకు న్యాయం చేస్తామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గణపురం మండలం అప్పయ్యపల్లి గ్రామంలో భూ సర్వేపై నిర్వహించిన గ్రామసభలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. గ్రామస్థులు, రైతులతో భూ సర్వే ప్రక్రియపై చర్చించి పలు సూచనలు చేశారు. అప్పయ్యపల్లిలో 99 సర్వే నంబర్ల పరిధిలో సుమారు 450 ఎకరాల్లో భూ సర్వే చేపట్టి, భూముల హద్దులను ఖరారు చేసి రికార్డులను సరిచేయనున్నట్లు తెలిపారు. ఇతరుల పేర్లలో ఉన్న భూములను అసలైన యజమానుల పేర్లకు మార్చేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
రైతులకు ఇబ్బందులు లేకుండా అధికారులు గ్రామాలకు వచ్చి సర్వే నిర్వహిస్తున్నారని, ప్రతి రైతుకు న్యాయం జరిగేలా పారదర్శకంగా ప్రక్రియ కొనసాగాలని సూచించారు. భూ రికార్డులు సక్రమంగా ఉంటే రైతుబంధు, రైతు భరోసా వంటి పథకాల లబ్ధి సులభంగా అందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఆడ్లూరి రాజేశ్వరరావు, ఎంపీడీవో లంకపెళ్లి. భాస్కర్, సర్పంచ్ ఎలుక పెళ్లి రమేష్, సింగిల్ విండో చైర్మన్ కన్నబోయిన కుమార్ యాదవ్, అసిస్టెంట్ డైరెక్టర్ (సర్వే) కుసుమ కుమారి, ఉప సర్పంచ్ కనపర్తి వినయ్ కుమార్, బోల్లెడ్ల ప్రభాకర్ రెడ్డి, దోమల రాజయ్య, దోమల రవీందర్, కొడారి రవీందర్, పిడిశెట్టి దేవేందర్, ఎల్లబోయిన ఓదెలు, ఎల్లబోయిన చంద్రయ్య, ముక్కెర సాంబయ్య, ఎలకపల్లి నవీన్, మారేపేల్లి తిరుపతిరెడ్డి, మాటేటి రవి తదితరులు పాల్గొన్నారు.






