4 July, 2026 | 2:03 AM

హుస్నాబాద్ ఆలయాల హుండీల్లో చోరీ

04-07-2026 01:06 AM

కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం

హుస్నాబాద్, జూలై 3: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో గురువారం అర్ధరాత్రి ఆలయాల్లో చోరీ ఘటన చోటుచేసుకుంది. స్థానిక మార్కండేయ స్వామి దేవాలయం, రామాలయం సమీపంలోని అభయ వీరాంజనేయ స్వామి ఆలయాల్లోకి చొరబడిన గుర్తుతెలియని దుండగులు హుండీలను ధ్వంసం చేసి, అందులో భక్తులు సమర్పించిన నగదు కానుకలను అపహరించారు.

శుక్రవారం ఉదయం ఆలయాలకు వచ్చిన నిర్వాహకులు హుండీలు పగులగొట్టి ఉండటాన్ని గమనించి వెంటనే హుస్నాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలన చేపట్టి, క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. ఆలయ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.

ఇటీవల హుస్నాబాద్ ప్రధాన రహదారిలోని మూడు ఇళ్లలో జరిగిన చోరీ ఘటన మరువక ముందే ఆలయాల్లో చోరీ జరగడం స్థానికుల్లో ఆందోళనకు కారణమైంది. అయితే ఈ రెండు ఘటనలకు సంబంధం ఉందా లేదా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ఆలయ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులను త్వరలోనే గుర్తించి పట్టుకుంటామని తెలిపారు. ప్రస్తుతం అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది.