యువత స్వయం ఉపాధితో రాణించాలి
-ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
వెంకటాపూర్, మే 13 (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లో యువత స్వయం ఉపాధి రంగాల్లో రాణించడం అభినందనీయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మండలంలోని నారాయణగిరిపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ బాలాజీ ట్రేడర్స్ దుకాణాన్ని బుధవారం ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఇలాంటి వ్యాపార సంస్థలు ఏర్పడటం వల్ల ప్రజలకు అవసరమైన సరుకులు, సేవలు స్థానికంగానే అందుబాటులోకి వస్తాయని తెలిపారు. యువత ఉద్యోగాల కోసం మాత్రమే ఎదురు చూడకుండా స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు, రుణ సదుపాయాలను వినియోగించుకుని ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. అనంతరం షాప్ యజమాని గూటోజు కృష్ణను ఎమ్మెల్యే శాలువాతో సత్కరించి, వ్యాపారంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు, వ్యాపార నిర్వాహకులు పాల్గొన్నారు.






