14 May, 2026 | 3:00 AM

హైకోర్టు భవన నిర్మాణంలో అవినీతి పునాదులు!

14-05-2026 01:53 AM

200 కోట్ల వరకు అంచనాల పెంపు

దృఢమైన మట్టిని మెత్తటి మట్టిగా చూపించే ప్రయత్నం.. దీనితో మరింత లోతుగా తవ్వి 

కాంక్రీట్ నిర్మాణం పేరుతో దోపిడీకి స్కెచ్ 

సుమారు 25% అంచనాలు పెంచేసిన వైనం 

ఇష్టారాజ్యంగా నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ 

అభ్యంతరం వ్యక్తంచేస్తూ హైకోర్ట్ బిల్డింగ్ కమిటీకి కన్సల్టెంట్ లేఖ

హైదరాబాద్, మే 13 (విజయక్రాంతి): హైకోర్టు భవనాల నిర్మాణంలో అవినీతి చెద లు కనిపిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర నూతన హైకోర్టు భవ న సముదాయం, న్యాయమూర్తుల నివాసాల సముదాయాల నిర్మాణాన్ని చేపట్టింది. అయి తే హైకోర్టు భవన నిర్మాణం పనుల్లో నాణ్యతాలోపం, అంచనాలను భారీగా పెంచేలా.. పలు సాంకేతిక అంశాలను తెరపైకి తీసుకొచ్చారు.

ఇందులో భాగంగా హైకోర్టు నిర్మా ణం చేపడుతున్న ప్రాంతంలోని మట్టి భారా న్ని మోసే సామర్థ్యం తక్కువగా ఉందని (మెత్తగా ఉందని) రికార్డులను తారుమారు చేసి.. అదనంగా లోతుగా తవ్వాలని, అలాగే అదనంగా కాంక్రీట్ పనులు, పిల్లర్లను వేయాల్సి ఉంటుందనేలా కొత్త పథకాన్ని తెరపైకి తీసుకువచ్చారు. దీంతో సెల్లార్లకు సంబంధించిన వ్యయం సుమారు 280 శాతం పెరిగిందని, మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయంలో సుమా రు 200 కోట్ల వరకు పెరిగిందని తెలుస్తోంది.

100 ఎకరాల్లో ఏర్పాటు.. 

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో నూతన హైకోర్టు భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇందుకు రాజేంద్రనగర్‌లో ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఆనుకుని సుమారు 100 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. నూతన హైకోర్టు నిర్మాణ భవన సముదాయాల నిర్మాణాన్ని చేపట్టేందుకు రూ. 2,583 కోట్ల వ్యయం అంచనాలతో పరిపాలనా అనుమతులను 2024 డిసెంబర్‌లో ఇచ్చారు.

ఇందులో ప్రధానమైన కోర్టు భవనం, న్యాయమూర్తుల నివాస సముదాయం, న్యాయవాదులు, కక్షిదారుల కోసం.. ఇలా అన్ని రకాల వసతులతో నిర్మించే భవనానికి రూ. 1,443.73 కోట్లతో (ఈసీవీ-ఎస్టిమేటెడ్ కాంట్రాక్ట్ వాల్యూ) టెండర్లు పిలిచారు. అయితే సు మారు 4.95 శాతం ఎక్కువకు కోట్‌చేసిన డీఈసీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ (ఇండియా) ప్రై.లి. అనే సంస్థ ఈ టెండర్‌ను రూ. 1,515 కోట్లకు దక్కించుకుంది.

మరో రూ. 603 కోట్లను హైకోర్టులో కావాల్సిన ఫర్నిచర్, ఇంటీరియర్, ఇతర వస్తుసామాగ్రిని ఏర్పాటు చేయడానికి కేటాయించారు. మొత్తం 36.52 లక్షల చదరపు అడుగుల మేర నిర్మాణ పనులను చేపట్టారు.  జోన్-1లో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లు 3, అడ్వొ కేట్స్ బ్లాక్‌లు 3, పబ్లిక్ వసతులు, సౌకర్యాల బ్లాక్, పబ్లిక పార్కింగ్, అడ్వొకేట్ పార్కింగ్, బార్ కౌన్సిల్‌ను నిర్మించనున్నారు.

అలాగే ప్రధాన కోర్టు భవనంలో మొత్తం 51 కోర్ట్ హాళ్లు ఉంటాయి. వీటి మొత్తం విస్తీర్ణం 6.52 లక్షల చదరపు అడుగులు. ఇక జోన్-2లో హైకోర్టు చీఫ్ జస్టిస్ నివాసం, సచివాలయం, అలాగే మరో 41 న్యాయమూర్తుల బంగాళాలు, క్లబ్‌హౌజ్, ఆడిటోరియం, సెంట్రల్ రికార్డ్ రూం తది తర నిర్మాణాలు ఉండనున్నాయి. వీటికి అదనంగా జడ్జీల పార్కింగ్‌లను కూడా ఏర్పాటుచేస్తారు.

నాణ్యతాలోపంతో పనులు..

వాస్తవానికి మట్టి బరువుమోసే సామర్థ్యాన్ని తగ్గించి చూపడంతో.. అదనపు పనులు చేపట్టే అవకాశం చిక్కింది. దీనివల్ల అదనంగా లాభం కలుగుతుంది. అలాగే.. చేసే పనుల్లోనూ నాణ్యత లేకుండా, సాంకేతిక అంశాలకు, డ్రాయింగ్ లకు విరుద్ధంగా పనులు చేస్తుండటంతో.. భవిష్యత్తులో ప్రమాదాలను ఎదుర్కొవాలి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాంట్రాక్టరు కేవలం తమకు లాభం కలగాలనే ఉద్దేశంతో పునాది, బేస్ నిర్మాణంలో వాడాల్సినంత స్టీల్‌ను వాడటంలేదని తెలుస్తుంది.

స్టీల్ సపోర్ట్ లేకుండానే.. రీఎన్‌ఫోర్స్‌డ్ సిమెంట్ కాంక్రీట్(ఆర్‌సీసీ) పనులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే పద్ధతి లేకుండా బేస్ కాంక్రీట్ పనులు చేస్తున్నట్టుగా నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న కన్సల్టెంట్ సంస్థకూడా గుర్తించింది. డ్రాయింగ్‌ల ప్రకారం కాకుండా.. ఇష్టారాజ్యంగా స్టీల్‌ను వాడుతున్నారు. షట్లర్ ప్లేట్లు సరైనవి వాడకపోవడం వల్ల కాంక్రీట్ వేసిన తరువాత ఉబ్బిపోయి పగుళ్లు ఏర్పడుతున్నాయి. ఇలా కాంట్రాక్టరు తన ఇష్టారాజ్యంగా నిర్మాణం పనులు చేపడుతున్నట్టుగా అధికారులు కూడా గుర్తించినట్టు సమాచారం.

కన్సల్టెంట్ లేఖ..

రాష్ట్ర హైకోర్టు నూతన భవన సముదాయం నిర్మాణానికి సంబంధించి టీం వన్ ఇండియా ప్రై.లి. అనే ఇంజనీరింగు సంస్థను కన్సల్టెంట్‌గా నియమించుకున్నారు. ఈ కన్సల్టెంట్ సంస్థ.. హైకోర్టు నిర్మాణాలకు సంబంధించి సాంకేతిక అంశాలను పరిశీలిస్తుంది. అలాగే ్రడ్రాయింగ్‌లు, డిజైన్లను రూపొం దించి, వాటికి అనుమతి తీసుకుని వాటి ప్రకారం నిర్మాణ పనులను చేపట్టేలా చూస్తుంది.

అయితే ప్రస్తుతం చేపడుతున్న నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి సదరు టీం వన్ ఇండి యా ప్రై.లి. సంస్థ ప్రతినిధులతో.. కాంట్రాక్టు సంస్థ సరిగా వ్యవహరించడం లేదని, సహకరించడం లేదని పేర్కొంటూ.. దీనితోపాటు.. పలు సాంకేతిక అంశాలను పేర్కొంటూ.. 2025 డిసెంబర్ 17న సదరు కన్సల్టెంట్ సంస్థ హైకోర్టు బిల్డింగ్ కమిటీకి ఏకంగా లేఖ రాసింది. ఇందులోనే.. మట్టి బరువుమోసే సామర్థ్యం (సాయిల్ బియరింగ్ కెపాసిటీ) విషయంలో.. చుట్టుపక్కల 115 టన్నులు/స్కేర్‌మీటర్ ఉండగా.. హైకోర్టు నిర్మాణ స్థంలో కేవలం 40 నుంచి 70 టన్నులు/స్కేర్ మీటర్‌గా పేర్కొనడాన్ని ఎత్తి చూపింది.

దీనివల్ల అదనంగా రాష్ట్ర ప్రభుత్వంపై వ్యయ భారం పెరుగుతుందని, ఇది సరైందికాదంటూ తేల్చిచెప్పింది. సాయిల్ బియరింగ్ కెపాసిటీని సరిగ్గా నిర్ధారించడానికి ప్లేట్ లోడ్ టెస్ట్ నిర్వహించాలనికూడా కన్సల్టెంట్ సంస్థ రాసిన లేఖలో స్పష్టంగా సూచించింది.

నిర్మాణ ప్రాంతంలో 160 మంది సాంకేతిక సిబ్బందిని వినియోగిస్తున్నామని కాంట్రాక్ట్ సంస్థ చెబుతున్నప్పటికీ.. కేవలం 20 నుంచి 30 మంది మాత్రమే ఉన్నారని, అలాగే నిర్మాణంలో 700 మంది కార్మికులు పనులు చేస్తున్నట్టుగా చెబుతున్నప్పటికీ.. కేవలం 150 నుంచి 200 మంది మాత్రమే పనులు చేస్తున్నారని.. దీని ప్రభావం పనుల నాణ్యతపై తప్పకుండా ఉంటుందని కన్సల్టెంట్ సంస్థ పేర్కొంది.

అనేక అంశాలు.. 

హైకోర్టు నిర్మాణ పనులకు నియమించిన కన్సల్టెంట్ సంస్థ టీం వన్ ఇండియా ప్రై.లి. సంస్థ 2025 డిసెంబర్ 17న హైకోర్టు బిల్డింగ్ కమిటీకి రాసిన లేఖలో సుమారు 10 అంశాలను చర్చించారు. ఇందులో ప్రధాన మైనది మట్టి బరువు మోసే సామర్థ్యం (సాయిల్ బియరింగ్ కెపాసిటీ కాగా.. స్ట్రక్చరల్ డిజైన్‌లో తేడాలున్నాయని, అలాగే భవిష్యత్తులో హైకోర్టు భవనం ఎత్తు పెంచాల్సిన అవసరం లేదని స్పష్టంగా ఉన్నప్పటికీ.. ఈ నిబంధనను పక్కనపెట్టి.. భవిష్యత్తు అవసరాలమేరకు అంటూ అదనంగా మరోరెండు ఫ్లోర్ల నిర్మా ణం అనే అంశాన్ని పక్కనపెట్టినట్టుగా లేఖలో స్పష్టంగా పేరొ ్కన్నారు.

అలాగే సరైన సమయంలోనే అన్ని రకాల డ్రాయింగ్‌లను సమర్పించినట్టు, ఇందు లో గరష్టంగా ఐఐటీ స్థాయిలో పరిశీలిం చి అంగీకరించారని తెలిపారు. హైకోర్టు భవన సముదా యం చుట్టూ సుమారు 3.4 కి.మీ పొడవునా.. చూట్టూ ప్రహారీగోడ ని ర్మించాల్సి ఉందని పేర్కొన్నా రు. అలాగే.. సుమారు 100 ఎకరాల స్థలాన్ని చదునుచేసే విష యంలో మినిమం కట్ అండ్ ఫిల్ అనే పద్ధతిలో చేస్తే ఎర్త్ వర్క్ శ్రమ తగ్గుతుందని, తద్వారా వ్యయాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నారు.

దీనితోపాటు.. బిల్డింగ్ ఎంట్రన్స్‌లు, ఎగ్జిట్‌దారులు వర దనీరు, డ్రెయిన్ల నిర్వహణ, ఫైర్‌సేఫ్టీ, పార్కింగ్ స్థలాలు (2,800 వాహనాలు పార్కింగ్ చేసే అవకాశం), స్టాఫ్ క్వార్టర్ల నిర్మాణంపై వారి డ్రాయింగ్‌లను, డిజైన్లను స్పష్టంగా పేర్కొంటూ.. తమ డ్రాయింగ్‌లు, డిజైన్లు, చేసిన సవరణలకు సంబంధించినవాటిని పరిశీలించి బిల్డింగ్ కమిటీ అనుమతి ఇవ్వాలని కన్సల్టెంట్ రాసిన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. అదనంగా వ్యయం కాకుండా చూడాలని కూడా అందులో తెలపడం గమనార్హం.

సామర్థ్యాన్ని తగ్గించేసి..

హైకోర్టు నిర్మాణంలో మొదటిదైన.. పునాదిలోనే అవినీతికి రాయిపడిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి రూ. 1,515 కోట్లకు కాంట్రాక్టు కుదిరినప్పటికీ.. దీనిని వివిధ సాంకేతిక కారణాలను చూపెట్టి.. అదనంగా సుమారు రూ. 200 కోట్ల వరకు అంచనాలను పెంచినట్టుగా వినపడుతోంది. ఇందుకు ప్రధాన కారణంగా.. బరువుమోసే మట్టి సామర్థ్యాన్ని తక్కువగా చూపించినట్టు తెలుస్తుంది.

వాస్తవానికి హైకోర్టు నిర్మాణం జరుగుతున్న ప్రదేశాలకు చుట్టుపక్కల మట్టికి బరువుమోసే సామర్థ్యం (సాయిల్ బియరింగ్ కెపాసిటీ 115 టన్నులు/ స్కేర్ మీటర్ ఉండగా.. హైకోర్టు నిర్మాణ ప్రాంతంలోని మట్టి బరువు మోసే సామర్థ్యం  40 టన్నులు/స్కేర్ మీటర్ నుంచి 70 టన్నులు/స్కేర్‌మీటర్‌గా చూపించి.. అందుకు అనుగుణంగానే నిర్మాణ పనులు చేపట్టారు. ఇందుకోసం ప్రైవేటు ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్టును సైతం మార్చివేశారనే ఆరోపణలు బలంగా వినపడుతున్నాయి.

రూ. 200 కోట్ల అదనపు పనులు.. 

మట్టి బరువుమోసే సామర్థ్యాన్ని తగ్గించి చూపడంతో.. అదనంగా కాంక్రీట్, పిల్లర్లు, బేస్ కాంక్రీట్ పనులు పునాదులను వెడల్పుగా చేపట్టాల్సి వచ్చింది. జి+6 అంతస్తులతోపాటు.. పార్కింగ్ కోసం సెల్లార్ల తవ్వకాలు చేయడంతో.. మరింత దృఢంగా తయారుచేయాల్సిన అవసరం ఉందనేలా సాంకేతిక అంశా లను చూపెట్టి.. అదనపు పనులను చేపట్టినట్టు అరోపణలు గుప్పుమన్నారు.

ఫౌండేషన్ తవ్వకాలు, పు టింగ్ వెడల్పు, వాటర్‌ప్రూఫింగ్, స్టీల్ పైల్స్ లాంటివి భూమి లోపలే చేపట్టాల్సి ఉంటుంది. వీటిని తూతూ మంత్రంగా చేసి.. పూర్తిచేస్తే.. భూమిలోపల ఉంటాయి కనుక ఎవరూ కనుక్కోలేరన్నమాట. అదనంగా సెల్లార్‌ను నిర్మించాల్సి వచ్చింది. దీనితో సుమారు రూ. 200 కోట్ల వరకు అంచనాలు పెరిగినట్టుగా అధికారవర్గాల్లోనే చర్చ జరుగుతోంది.

అధికారుల మౌనం.. 

వాస్తవానికి కన్సల్టెంట్ గుర్తించిన తీవ్రమైన అంశాలపై రోడ్లు భవనాల శాఖ అధికారుల్లోనూ చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే తెరవెనుక రాష్ట్ర ప్రభుత్వంలోని కీలకమైన నేతల అజమాయిషీలో ఉండే ఉన్నతస్థాయి అధికారుల నుంచి వచ్చిన హుకూంతో.. ఆర్ అండ్ బీ అధికారులు మౌనం పాటించాల్సి వచ్చిందనే చర్చ జరుగుతోంది. నాణ్యతలోపంగా, భారీగా వ్యయం పెంచేలా పనులు చేపట్టడాన్ని వ్యతిరేకించడంతో.. కన్సల్టెంట్‌ను తప్పించే ప్రయత్నంకూడా జరిగినట్టుగా తెలుస్తుంది.

అధిక వ్యయం జరగనున్న అంశాలను ప్రస్తావించకుండా.. ఇతర సాంకేతిక అంశాలను సాకుగా చూపెట్టి.. అవసరమైతే.. కన్సల్టెంట్‌ను తప్పించి.. కొత్త కన్సల్టెంట్‌ను నియమించుకుంటామనేలా హెచ్చరించినట్టుగా చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే.. బిల్డింగ్ కమిటీకి కన్సల్టెంట్ లేఖ రాస్తూ.. అందులో సుమారు 10 అంశాలను లోతుగా విశ్లేషించి..

తెరవెనుక జరుగుతున్న అంశాలను బిల్డింగ్ కమిటీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్టుగా సమాచారం. అయితే దీనిపై ఎలాంటి చర్యలు ఇప్పటివరకు లేవు. ఇక ఏం జరుగుతుందోనని అందరూ ఎదురుచూస్తున్నారు. మొత్తానికి అందరికీ న్యాయం అందించే హైకోర్టు భవన సముదాయం నిర్మాణంలో అవినీతి పునాదులు ఉండటంపై సర్వత్రా చర్చనీయాంశమయ్యింది.