క్వింటాకు ఐదు కిలోల తరుగు.. నిలువు దోపిడే
ఏఐకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల విశ్వనాధం
భద్రాద్రి కొత్తగూడెం, మే 13, (విజయక్రాంతి): ధాన్యం క్వింటాకు ఐదు కిలోల తరుగు తీయడం రైతులను నిలువు దోపిడీ చేయడమేనని, దీనిని వెంటనే నిలిపివేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం (ఏఐకేఎస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల విశ్వనాధం డిమాండ్ చేశారు. బుధవారం చుంచుపల్లి మండల పరిధిలోని పెనగడప గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా ప్రతినిధిబృందం సందర్శించి, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి వస్తే, తరుగు పేరుతో అడ్డగోలుగా కోత విధిస్తూ అన్నదాతలను మోసం చేయడం అన్యాయమన్నారు. ఇప్పటి వరకు కోత పెట్టిన ధాన్యం విలువను లెక్కకట్టి ఆ సొమ్మును తక్షణమే రైతుల ఖాతాల్లో జమ చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. తరుగు పేరుతో రైతులకు జరుగుతున్న అన్యాయంపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించాలని కోరారు.
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సరిపడా టార్పాలిన్లు, గిడ్డంగి సౌకర్యం, తాగునీరు, ఎండ తగలకుండా నీడ వంటి కనీస వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా ధాన్యం సేకరించాలని, నిబంధనలు అతిక్రమిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రతినిధి బృందంలో సంఘం నాయకులు సలిగంటి శ్రీనివాస్, వీసంశెట్టి పూర్ణచందర్ రావు, నీడలా సుధాకర్, కట్ట నాగయ్య, ఉదయ్, నవీన్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.






