బలపరీక్షలో నెగ్గిన టీవీకే
అసెంబ్లీలో ‘విజయం’
- అనుకూలంగా 144 మంది ఎమ్మెల్యే ఓటు
- వ్యతిరేకంగా 22 మంది ఓటింగ్
- సభ నుంచి వాకౌట్ చేసిన డీఎంకే సభ్యులు
- మద్దతు పలికిన ఏఐఏడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలు
- విజయ్ సర్కార్ బలపరీక్షలో నెగ్గడంతో తమిళనాట సంబురాలు
చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎన్నికైన టీవీకే అధినేత సి.జోసెఫ్ విజయ్ తన రాజకీయ ప్రయాణంలో తొలి అడుగు విజయవంతంగా వేశారు. బుధవారం జరిగిన బల పరీక్షలో ఆయన నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వం స్పష్టమైన మెజార్టీ సాధించింది. మొత్తం 144 మంది ఎమ్మెల్యేలు విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు.
22 మంది సభ్యులు వ్యతిరేకించగా.. ఐదుగురు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ నేతృత్వంలో డీఎంకే సభ్యులు బలపరీక్షకు ముందే సభ నుంచి వాకౌట్ చేశారు. డీఎండీకే ఎమ్మెల్యే ప్రేమలత విజయకాంత్ కూడా వారితో కలిసి వాకౌట్ చేయడం గమనార్హం.
రీల్ పాలన కాదు.. రియల్ పాలన చేయాలి : ఉదయనిధి స్టాలిన్
సభలో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభానికి ముందు ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇన్ స్టాగ్రామ్’రీల్’ పాలన కాకుండా.. రియల్ పాలన చేయాలని ఎద్దేవా చేశారు. మెజారిటీకి కావాల్సిన 118 సీట్లు టీవీకేకు లేవని ఆయన గుర్తు చేశారు. మిత్రపక్షాల అండతోనే ఈ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శించారు. ఏఐఏడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి భేటీ కావడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇది రాజకీయ మార్పు కాదని.. కేవలం ఎమ్మెల్యేల మార్పిడి అని వ్యాఖ్యానించారు. తాము ఓటింగ్లో పాల్గొనడం లేదని స్పష్టం చేస్తూ సభ నుంచి నిష్క్రమించారు.
ఏఐఏడీఎంకే వర్సెస్ ఏఐడీఎంకే
బలపరీక్షలో ఏఐఏడీఎంకే పార్టీ నిలువునా చీలిపోయింది. సి.వి. షణ్ముగం వర్గానికి చెందిన 25 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. వీరందరూ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. మరోవైపు ఎడప్పాడి పళనిస్వామి (EPS) వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. సభలో ఎస్.పి. వేలుమణి నేతృత్వంలోని తిరుగుబాటు సభ్యులు మద్దతు తెలపడంపై ఈపీఎస్ వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి పదవుల ఆశ చూపి తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారని పళనిస్వామి ఆరోపించారు. పార్టీకి వెన్నుపోటు పొడిచిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గుర్రపు పందెం వేగంతో పాలన : నూతన సీఎం విజయ్
ఓటింగ్ ఫలితాల అనంతరం ము ఖ్యమంత్రి విజయ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రభుత్వం పూర్తి గా లౌకికవాదంతో పనిచేస్తుందని ఆ యన స్పష్టం చేశారు. గుర్రపు పందెం వేగంతో తమ పాలన సాగుతుందని.. ఆ పందేలకు తావు ఉండదని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. టీవీకే విజయం సాధించడంతో తమిళనాడు వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ప్రజలు కోరుకున్న మార్పు మొదలైందని పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేశారు. స్పీకర్ జె.సి.డి. ప్రభాకర్ సభను నిరవధికంగా వాయిదా వేశారు.
ఓఎస్డీగా జ్యోతిష్యుడి నియామకం రద్దు
భారీ విమర్శల నేపథ్యంలో నియామకాన్ని రద్దు చేసిన ప్రభుత్వం
చెన్నై, మే 13: తమిళనాడులో కొత్తగా కొలువుదీరిన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వానికి ఆదిలోనే అన్ని రాజకీయ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకిత ఎదురైంది. అధికారంలోకి వచ్చిన తొలిరోజే విజయ్ ప్రభుత్వం తీవ్ర వివాదంలో చిక్కుకుంది. రాధన్ పండిట్ వెట్రివేల్ అనే జ్యోతిష్కుడిని ముఖ్యమంత్రికి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (పొలిటికల్)గా సీఎం విజయ్ నియమించడం పెను దుమారం రేపింది.
జ్యోతిష్కుడి నియామకంపై అన్ని రాజకీయ పార్టీల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో విజయ్ సర్కార్ ఓఎస్డీ బాధ్యతల నుంచి వెట్రివేల్‌ను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశా రు. బుధవారం ఉదయం విశ్వాస పరీక్షలో నెగ్గిన వెంటనే విజయ్ ప్రభుత్వం రాధన్ పం డిట్ వెట్రివేల్ అనే జ్యోతిష్కుడిని ముఖ్యమంత్రికి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (పొలి టికల్)గా నియమించింది. దీంతో మిత్రపక్షాలు, ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం కొన్ని గంటల్లోనే ఆ నియామకాన్ని వెనక్కి తీసుకుంది.
విశ్వాస పరీక్ష సందర్భంగా అసెంబ్లీలో మా ట్లాడిన డీఎండీకే చీఫ్ ప్రేమలత విజయకాంత్, ఈ నియామకాన్ని తీవ్రంగా ఖండిం చారు. అలాగే ప్రభుత్వానికి మద్దతిస్తున్న కీల క మిత్రపక్షాలైన విడుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే), కాంగ్రెస్ కూడా ఈ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో విమర్శలు వెల్లువెత్తడంతో టీవీకే నేత సీటీ నిర్మల్ కుమార్ తొలుత ఈ నియామకాన్ని సమర్థించే ప్రయత్నం చేశారు. వెట్రివేల్‌ను మీడి యా ప్రతినిధిగా నియమించామని, ఆయన వృత్తితో సంబంధం లేదని తెలిపారు.
అయితే, ఒత్తిడి పెరగడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కాగా రాధన్ పండిట్ వెట్రివేల్‌కు గతంలోనూ రాజకీయ ప్రముఖులతో సంబంధాలున్నాయి. దివంగత ముఖ్యమంత్రి జయలలితకు కూడా ఆయన సలహాదారుగా వ్యవ హరించినట్లు సమాచారం. ఏదేమైనా, మిత్రపక్షాల నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిడి కారణంగా, విజయ్ సర్కార్ వివాదాస్పద నియామకాన్ని రద్దు చేసుకోవలసి వచ్చింది.






