మొక్కజొన్న కొనుగోళ్లు వేగవంతం చేయాలి
కలెక్టర్ అంకిత్
ఇల్లందు టౌన్/ టేకులపల్లి, మే 13, (విజయక్రాంతి): జిల్లాలో మొక్కజొన్న కొనుగోళ్లను వేగవంతంగా పూర్తి చేసి రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు.
బుధవారం జిల్లాలోని ఇల్లందు వ్యవసాయ కమిటీ, చల్లసముద్రం, టేకులపల్లి, బోడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ పరిశీలించి కొనుగోలు, నిల్వ, లోడింగ్, రవాణా ప్రక్రియలపై సమీక్ష నిర్వహించారు. ఇల్లందు వ్యవసాయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్, అక్కడ నిల్వ ఉంచిన మొక్కజొన్న బ్యాగులు, కొనుగోలు వివరాలు, గోదాముల సామర్థ్యం, హమాలీల అందుబాటు తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుతం కేంద్రంలో 54 వేల మొక్కజొన్న బ్యాగులు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. వ్యవసాయ కమిటీ ప్రాంగణంలోని గోదాముల్లో సుమారు 3 వేల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం ఉన్నట్లు అధికారులు వివరించారు. టేకులపల్లి మండలంలో పర్యటించిన కలెక్టర్ టేకులపల్లి వ్యవసాయ కమిటీ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలోని మొక్కజొన్న నిల్వలు, రవాణా సదుపాయాలు, హమాలీల అందుబాటు, గోదాముల పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, మార్కెటింగ్ అధికారి నరేందర్, తాసిల్దార్లు, ఎంపీడీవోలు, కొనుగోలు కేంద్రాల ప్రత్యేక అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.






