మరోసారి నేపాలీ గ్యాంగ్!
వృద్ధ దంపతులను కట్టేసి దోపిడీ
బంగారం, వెండి నగలు, నగదుతో పరారీ
రెండువారాల క్రితం పనిమనుషులుగా చేరిన జంట
బర్త్‌డే వేడుక అంటూ పని కానిచ్చేశారు!
మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌లో ఘటన
జవహర్‌నగర్, మే 13 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో మరో నేపాలీ గ్యాంగ్ రెచ్చిపోయింది. రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్యను మరవకముందే మరో దోపిడీకి పాల్పడింది. నేపాలీ ముఠా సభ్యులు.. రిటైర్డ్ ప్రొఫెసర్ దంపతుల చేతులు, కాళ్లు కట్టేసి మరీ చోరీచేశారు. ఈ ఘటనలో 60 తులాల బంగారం, 25 కిలోల వెండి నగలు, రూ.35 వేల నగదు, 3వేల అమెరికా డాలర్లను దోచుకెళ్లారు. మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ ఠాణా పరిధిలో ఈ ఘటన జరిగింది.
జవహర్‌నగర్‌లోని కౌకుర్ గోల్ఫ్ ఎన్‌క్లేవ్‌లో రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీధర్ మోహన్, డాక్టర్ విజయలక్ష్మి దంపతులు నివాసముంటున్నారు. వారి ఇంట్లో నేపాల్‌కు చెందిన దంపతులు రెండు వారాల క్రితమే పని మనుషులుగా చేరారు. ఇటీవలే వారి బంధువుగా పరిచయమైన మరో మహిళ కూడా వచ్చి ఇంట్లోనే ఉంటోంది. సోమవారం రాత్రి నేపాలీ మహిళ తన జన్మదిన వేడుకలు చేసుకుంటామంటే.. అందుకు వృద్ధ దంపతులు అంగీకరించారు.
ఈ వేడుకలకు మరో ముగ్గురు బయట నుంచి వచ్చారు. వేడుకల అనంతరం భోజనం చేస్తుండగా వెనుక నుంచి దంపతులపై నేపాలీ గ్యాంగ్ దాడి చేసింది. కాళ్లు, చేతులు కట్టేసి కొట్టారు. ‘మమ్మల్ని చంపొద్దు.. మీకు కావాల్సింది తీసుకెళ్లండి’ అని దంపతులు కోరడంతో మత్తుమందు ఇచ్చి దోపిడీకి పాల్పడ్డారు. ఇంట్లో రూ.కోటి విలువైన నగలుతోపాటు నగదు, వస్తువులను దోచుకెళ్లారు. పరారయ్యేముందు, ఇంట్లోని సీసీ టీవీ కెమెరాలను ధ్వంసం చేసి.. అన్ని గేట్లకు తాళాలు వేశారు.
మంగళవారం మధ్యాహ్నం దంపతులు మత్తు నుంచి తేరుకుని కిటికిలో నుంచి గట్టిగా అరవడంతో ఇరుగు పొరుగువారు వచ్చి తలుపులు తీశారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టా రు. ఈ దోపిడీలో మొత్తం ఏడుగురు నిందితులు పాల్గొన్నారని పోలీసులు చెప్పారు.
ఆ ఇంటిని మల్కాజిగిరి సీపీ సుమతి పరిశీలించారు. దోపిడీ జరిగిన కాలనీలోని సీసీ టీవీ కెమెరాలను పోలీ సులు జల్లెడ పడుతున్నారు. దుండగులు చోరీ చేసి, నేపాల్‌కు పారిపోయినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు.






