రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
- ఆయకట్టు చివరి భూములకు సైతం సాగునీరు
- రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
చింతలపాలెం/ మఠంపల్లి, జూన్ 20 (విజయక్రాంతి): రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర భారీ నీటిపారుదల,పౌరసరఫరాల శాఖామంత్రి నల మాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని చింతలపాలెం, మఠంపల్లి, గరిడేపల్లి మండలాల్లో సుడిగాలి పర్యటనలు చేసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆయకట్టు చివరి భూములకు సైతం సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.రాష్ట్రంలోని రైతులకు త్వరలోనే రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని స్పష్టం చేశారు.తాజాగా రాష్ట్ర ప్రభుత్వం10 ప్రధాన వరి ఉత్పత్తులకు జిల్లాల్లో 50 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం తో దాదాపు 20 ప్రాంతాల్లో భారీ ధాన్యం నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయని చెప్పారు.
అనంత రం చింతలపాలెం వద్ద రూ.394 కోట్లతో నిర్మిస్తున్న రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను స్వయంగా పరిశీలించి మాట్లాడారు. ఈ ప్రాజెక్టు ద్వారా చింతలపాలెం, మేళ్లచెరువు, హుజూర్ నగర్, చిలుకూరు, కోదాడ మండలాల్లోని 14 వేల ఎకరాలకు కృష్ణా నదీజలాలు అందుతాయని చెప్పారు. తదనంతరం రూ.10 కోట్లతో చేపట్టే మేళ్లచెరువు -చింతిరియాల రోడ్డు పనులను ప్రారంభించారు.
మఠంపల్లి మండలంలోని రూ.2.20 కోట్లతో చేపట్టనున్న కామంచికుంట తండా నుంచి చింతల పాలెం వరకు రోడ్డు పనులకు శంకుస్థాపనలు చేశారు. గరిడేపల్లి మండలం పరెడ్డిగూ డెంలో గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్,ఎస్పీ నరసింహా, ఆర్డీఓ శ్రీనివాసులు, ఇరిగేషన్ ఎస్పీ నాగభూషణం, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్స య్య, వంగవీటి రామారావు, కొండారెడ్డి, ఇంద్రారెడ్డి,వివిధ శాఖల అధికారులు,నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






