7 May, 2026 | 4:41 PM

ప్రారంభోత్సవానికే పరిమితమైన చలివేంద్రం..!

07-05-2026 03:48 PM

త్రాగునీరు లేక వెలవెల పోతున్న వైనం...

బాన్సువాడ, మే 7 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో వేసవి తాపాన్ని తగ్గించేందుకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం మరుసటి రోజుకే నిర్లక్ష్యానికి గురైంది.కామప్ప చౌరస్తా సమీపంలో గ్రామ సర్పంచ్ ధర్మ తేజ ప్రారంభించిన ఈ చలివేంద్రం ప్రస్తుతం నీళ్లు లేక వెలవెలబోతోంది.ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న వేళ ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన చలివేంద్రం నిర్వహణ లేకపోవడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ప్రారంభోత్సవం రోజు మాత్రమే నీటి సౌకర్యం కల్పించి, తరువాత పట్టించుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు విమర్శిస్తున్నారు.ప్రజలకు ఉపశమనం కలిగించాల్సిన సేవలు కేవలం ప్రారంభోత్సవాలకే పరిమితమవుతున్నాయా..? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చలివేంద్రాన్ని నిరంతరం నిర్వహించే బాధ్యత ఎవరిది..? నీటి సరఫరా ఎందుకు నిలిచిపోయింది..? అనే విషయాలపై అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా చలివేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు పేర్కొంటున్నారు.