హైదరాబాద్ తొలి ఐటీ టవర్.. ఇక జ్ఞాపకమే!
- ఇంటర్ గ్రాఫ్ భవనాన్ని కూల్చివేస్తున్న యాజమాన్యం
- బేగంపేటలో 39 ఏళ్ల క్రితం నిర్మితమైన భవనం
- బలహీనపడటంతో.. భద్రతా చర్యల్లో భాగంగా కూల్చివేత
- ఆ స్థానంలోనే కమర్షియల్ టవర్ నిర్మాణం!
హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): ప్రస్తుతం ప్రపంచ ఐటీ రంగానికి కేరాఫ్ అడ్రస్‌గా హైదరాబాద్ నగరం ఎదిగింది. అంతర్జాతీయ దిగ్గజ సంస్థల కార్యాలయాలతో కళకళలాడుతున్న గచ్చిబౌలి, మాదాపూర్, నానక్‌రాంగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాలే నేటి తెలంగాణ ఐటీ రంగానికి గుర్తింపు. అయితే హైదరాబాద్ కేంద్రంగా ఎన్నో ప్రపంచ స్థాయి కంపెనీలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. కానీ హైదరాబాద్‌ను తొలిసారిగా ప్రపంచ ఐటీ మ్యాప్‌పై నిలబెట్టిన భవనం మాత్రం ఇక జ్ఞాపకంగా మిగలనుంది.
దాదాపు నాలుగు దశాబ్దాలుగా నగర ఐటీ చరిత్రకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన బేగంపేటలోని ఇంటర్ గ్రాఫ్ కన్సల్టింగ్ భవనాన్ని ఆ సంస్థ యాజమాన్యం కూల్చివేస్తోంది. నిర్మాణం బలహీనపడడం తో.. భద్రతా చర్యల్లో భాగంగా కూల్చివేసి, ఆ స్థానంలోనే కమర్షియల్ టవర్ నిర్మించనున్నట్లు సమాచారం. 1987లో అమెరికాకు చెందిన ఇంటర్ గ్రాఫ్ కన్సల్టింగ్ హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఆ రోజుల్లో దేశంలో ఐటీ రంగం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది.
బెంగళూరు కూడా పూర్తిస్థాయి గ్లోబల్ ఐటీ హబ్‌గా మారలేదు. అలాంటి సమయంలో హైదరాబాద్‌ను ఎంచుకుని అమెరికా సంస్థ తన డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం విశేషం. అప్పటి వరకు హైదరాబాద్ అంటే ప్రభుత్వ రంగ సంస్థలు, రక్షణ పరిశ్రమలు, ఔషధ రంగం మాత్రమే ప్రధానంగా ఉండేవి.
సాఫ్ట్‌వేర్ పరిశ్రమ గురంచి ప్రజలకు పెద్దగా తెలియని కాలంలో ఇంటర్‌గ్రాఫ్ రాకతో హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ రంగానికి తొలి పునాది పడింది. ఈ సంస్థలో పనిచేసిన ఇంజనీర్లలో చాలామంది తర్వాత దేశంలోని, విదేశాల్లోని ప్రముఖ ఐటీ కంపెనీలకు నాయకత్వం వహించారు.
బేగంపేటే తొలి ఐటీ కారిడార్..
ఇప్పుడు ఐటీ అంటే అందరికీ గుర్తొచ్చేది హైటెక్ సిటీ. కానీ 1990 ప్రారంభంలో హైదరాబాద్‌లో ఐటీ అంటే బేగంపేట, అమీర్‌పేట, సోమాజిగూడ, పంజాగుట్ట, బంజారాహిల్స్ ప్రాంతాలే. బేగంపేట విమానాశ్రయం సమీపంలో ఉండటంతో విదేశీ కంపెనీల ప్రతినిధులు సులభంగా వచ్చి వెళ్లే అవకాశం ఉండేది. అంతర్జాతీయ కనెక్టివిటీ, నగర మధ్యలో ఉండటం, ప్రభుత్వ కార్యాలయాలకు దగ్గరగా ఉండ టం వంటి కారణాలతో బేగంపేట మొదటి ఐటీ కేంద్రంగా ఎదిగింది.
ఇంటర్‌గ్రాఫ్‌తో పాటు బ్రిగేడ్, టాటా సెర్విజోల్, విప్రో, ఎయిర్‌టెల్ వంటి సంస్థలు ఇక్కడే కార్యకలాపాలు నిర్వహించాయి. మేఫిర్, సిటీ సెంటర్ కాంప్లెక్స్‌ల్లో సత్యం కంప్యూటర్స్ పనిచేసేది. పంజాగుట్టలో ఓఎస్‌ఐ, బంజారాహిల్స్‌లో హెచ్‌ఎస్బీసీ, సియారా అట్లాం టిక్, సోమాజిగూడలో ఏడీపీ, 24/7 కస్టమర్ వంటి సంస్థలు తమ కార్యకలాపాలు సాగించాయి. అయితే ఇంటర్‌గ్రాఫ్ కార్యకలాపాల మొదలైన తర్వాతే హైదరాబాద్‌పై అంతర్జాతీయ కంపెనీల దృష్టి పడింది.
త ర్వాతి దశలో మరిన్ని కంపెనీలు నగరంలో పెట్టుబడులు పెట్టడానికి కారణమైంది. ఆ సమయంలో ఆయా ప్రభుత్వాలు కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. మాదాపూర్‌లో సైబర్ టవర్స్ నిర్మాణం, ప్రత్యేక ఐటీ విధానాలు, భారీ భూ కేటాయింపులు, రహదారులు, విద్యుత్, కమ్యూనికేషన్ సదుపా యాల కల్పనతో ఐటీ రంగం పశ్చిమ హైదరాబాద్ వైపు విస్తరించింది. దీంతో బేగంపేట నుంచి మొదలైన ఐటీ ప్రస్థానం మాదాపూర్, గచ్చిబౌలి, నా నక్‌రాంగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు విస్తరించింది.
నగర ఐటీ చరిత్రలో తొలి పునాది
దాదాపు 39 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనం ఇటీవల నిర్మాణపరంగా బలహీనపడినట్లు గుర్తించారు. ముఖ్యంగా భూగర్భంలో ఉన్న నీటి సంపు దెబ్బతినడం వల్ల పునాదులపై ప్రభావం పడినట్లు యాజమాన్యం నిర్ధారించింది. భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా భద్రతాపరమైన చర్యగా భవనాన్ని పూర్తిగా కూల్చివేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. పాత భవనం స్థానంలో ఆధునిక కమర్షియల్ టవర్ నిర్మించే యోచనలో యాజమాన్యం ఉన్నట్లు సమాచారం.
కూల్చివేత నేపథ్యంలో హైదరాబాద్ ఐటీ చరిత్రలో తొలి అధ్యాయం రాసిన భవనంగా, ఒక నగర భవిష్యత్తును మార్చిన కట్టడంగా, తెలంగాణ ఐటీ ప్రస్థానానికి నాంది పలికిన చిరస్మరణీయ గుర్తుగా ఇంటర్‌గ్రాఫ్ భవనం ఎప్పటికీ నిలిచిపోనుంది. హైదరాబాద్ వేగంగా మారుతోంది. పాత భవనాలు కూలిపోతున్నాయి. కొత్త గ్లాస్ టవర్లు వస్తున్నాయి. అయితే అభివృద్ధి సహజమే.. కానీ నగర చరిత్రకు ప్రతీకలైన కొన్ని కట్టడాలను పూర్తిగా చెరిపేయడం సరైనదేనా? అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.
ప్రపంచంలోని అనేక నగరాల్లో తొలి పరిశ్రమలు, తొలి ఐటీ కార్యాలయాలు, తొలి సాంకేతిక కేంద్రాలను వారసత్వ కట్టడాలుగా పరిరక్షిస్తున్నారు. అలాంటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఇంటర్‌గ్రాఫ్ భవనం విషయంలో కూడా కనీసం కొంత భాగాన్ని అయినా సంరక్షించి ఉంటే బాగుండేదని పలువురు మాజీ ఐటీ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.






