మహా ‘టెట్’ పేపర్ లీక్
థానే జిల్లాలో అమ్మకానికి..
బీహార్, హర్యానాకు చెందిన ముగ్గురి అరెస్ట్
అంతర్రాష్ట్ర సిండికేట్ అక్రమాలను ఛేదించిన పోలీసులు.. రంగంలోకి సిట్
నేటి టెట్ వాయిదా.. ఆందోళనలో 6 లక్షల మంది అభ్యర్థులు
ముంబై, జూన్ 27: నీట్ పేపర్ లీక్‌పై తీవ్ర వివాదం నడుస్తున్న నేపథ్యంలో మరోపేపర్ లీక్ ఘటన శనివారం వెలుగులోకి రావడం తీవ్ర కలకలం రేపుతోంది. మహారాష్ట్ర టెట్ ప్రశ్నాపత్రం థానేలో లీకైంది. దీంతో మహారాష్ట్రలో ఆదివా రం జరగాల్సిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2026 కేవలం ఒక రోజు ముందు, శనివారం వాయిదా పడడంతో ఆరు లక్షల మంది అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో భివండిలో ముగ్గురిని అరెస్టు చేసి, అంతర్రాష్ట్ర సిండికేట్‌ను పోలీసులు ఛేదించారు. టెట్ పరీక్ష పేపర్ల కాపీలను స్వాధీనం చేసుకున్నారు. టెట్ లీక్ రాకెట్ నెట్‌వర్క్‌పై సిట్ ఏర్పాటైంది. సూత్రధారి కోసం వివిధ రాష్ట్రాలకు పోలీసు బృందాలు వెళ్లాయి. ఈ లీకేజీ అత్యంత దారుణమని, సూత్రధారులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే తెలిపారు.
నీట్ పేపర్ లీకైన రెండు నెలల తర్వాత.. మళ్లీ టెట్ పేపర్ లీక్ కావడంతో రాజకీయ దుమారం రేగుతోంది. బీజేపీ ప్రభుత్వం పరీక్షల నిర్వహణ గాలికి వదిలేసి..పార్టీల విచ్ఛిన్నంలో నిమగ్నమైందని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పార్టీలను చీల్చడమే అధికార బీజేపీ ప్రాధాన్యతగా మారిందని ప్రతిపక్షం ఆరోపించింది. ప్రశ్నాపత్రాల లీకేజీ మహారాష్ట్ర ప్రభుత్వానికే గుర్తింపుగా మారిందని తెలిపింది. ఈ ముఠాకు రాజకీయ రక్షణ ఎవరు కల్పిస్తున్నారు? అని కాంగ్రెస్ ప్రశ్నించింది.
మహారాష్ట్రలో ఆదివారం జరిగే టెట్‌కు 37 ప్రాంతాల్లోని 1,728 కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఈ పరీక్షకు సుమారు ఆరు లక్షల మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉందని అధికారులు తెలిపారు. అయితే థానే జిల్లాలో శనివారం టెట్ పరీక్షకు సంబంధించి లీక్ అయిన ప్రశ్నపత్రాలను కొందరు వ్యక్తులు అమ్మడానికి ప్రణాళిక రచిస్తున్నారని భివండి డీసీపీ (జోన్-2) పవన్ బన్సోద్‌కు రహస్య సమాచారం అందింది.
పలు పోలీస్ బృందాలు ఈ సమాచారాన్ని ధ్రువీకరించుకుని, ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నాయి. ఆదివారం జరగాల్సిన టెట్ పరీక్ష పేపర్ల కాపీలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. స్వాధీన పత్రాల ప్రామాణికతను ధ్రువీకరించడానికి విద్యాశాఖ ఉన్నతాధికా రులను పిలిపించారు. క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం, అనుమానితుల వద్ద లభించిన పత్రాలు జూన్ 28న జరిగిన పరీక్షకు సంబంధించిన అసలైన ప్రశ్నపత్రాలేనని నిర్ధారించారు.
దీంతో బీహార్, హర్యానాకు చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశామని, వీరంతా అంతర్రాష్ట్ర సిండికేట్‌కు చెందినవారని, ఇది రాష్ట్రాల వ్యాప్తంగా విస్తరించి ఉన్న ఒక బలమైన నెట్‌వర్క్‌ను సూచిస్తోందని పోలీసులు తెలిపారు. ఈ నెట్‌వర్క్‌పై పవన్ బన్సోద్ నేతృత్వంలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఇద్దరు ఏసీపీలు, 9 మంది పోలీస్ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు.
లీక్ వ్యవహారంతో జూన్ 28న జరగాల్సిన పరీక్షను వాయిదా వేశామని మహారాష్ట్ర రాష్ట్ర పరీక్షల మండలి (ఎంఎస్‌సీఈ) తెలిపింది. వదంతులను నమ్మవద్దని అభ్యర్థులను కోరింది. మళ్లీ టెట్ నిర్వహిస్తామని, తాజా షెడ్యూల్‌ను త్వరలో అధికారిక వెబ్‌సైట్లో పెడతామని ప్రకటించింది. పరీక్ష కోసం అభ్యర్థుల నుంచి ఎటువంటి రుసుమూ వసూలు చేయబోమని తెలిపింది. మళ్లీ టెట్ పరీక్షను నిర్వహించే ప్రక్రియకు సాధారణంగా సుమారు మూడు వారాలు పడుతుందని ఎంఎస్‌సీఈ డిప్యూటీ కమిషనర్ ప్రియా షిండే తెలిపారు.
లీకేజీల ఘనత..
టెట్ పేపర్ లీకేజీతో మహారాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పరీక్షల వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి సారించకుండా, ఇతర పార్టీలను విచ్ఛిన్నం చేయడంలోనే బీజేపీ, శివసేన నిమగ్నమయ్యాయని ఆరోపించాయి. ప్రశ్నపత్రాల లీకేజీ మహారాష్ట్ర ప్రభుత్వానికే ఒక గుర్తింపుగా మారిందని అన్నారు. షిండేకు కంచుకోటగా ఉన్న థానేలో, ఆదివారం జరగాల్సిన టెట్ ప్రశ్నాపత్రం లీకైంది.
లక్షలాది మంది విద్యార్థుల కఠిన శ్రమను, కలలను, భవిష్యత్తును నాశనం చేస్తున్న ఈ ముఠాకు రాజకీయ రక్షణ ఎవరు కల్పిస్తున్నారు? అని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ హర్షవర్ధన్ సప్కల్ ప్రశ్నించారు. దీనిపై నిష్పక్షపాత విచారణ జరపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ లీకేజీల వెనుక ఉన్నవారికి రాజకీయ లేదా పరిపాలనాపరమైన రక్షణ ఉందేమోనని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత విజయ్ వడెట్టివార్ అనుమానం వ్యక్తం చేశారు.
టెట్ ప్రశ్నపత్రాలే లీక్ అవుతుంటే, ఇక ఏ పరీక్షా సురక్షితం కాదని ఎన్సీపీ (ఎస్పీ) ప్రతినిధి అమోల్ మటేలే ఆరోపించారు. రాజకీయ పార్టీలను చీల్చడం, ఎంపీలను తమ వైపు తిప్పుకోవడం వంటి పనులు చేసిన ఈ ప్రభుత్వం, ఇప్పుడు లీకేజీలు, విశ్వాసఘాతాలకు కూడా మారుపేరుగా మారినట్లు కనిపిస్తోందని ఆయన ఆరోపించారు.
రాజకీయ పార్టీలను చీల్చడంపై కాకుండా, పదే పదే జరుగుతున్న ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టడంపై బీజేపీ ప్రభుత్వం దృష్టి సారించాలని శివసేన యూబీటీ నేత ఆదిత్య ఠాక్రే విమర్శించారు. వారు దేశ యువత భవిష్యత్‌ను ప్రమాదంలో పడేశారని అన్నారు. యువతీయువకులు ప్రతి ఏటా నిరసనలు తెలుపుతూనే గడపాలా? యువత తమ భవిష్యత్తు గురించి కలలు కనడానికి, దానిని నిర్మించుకోవడానికి ఎప్పుడు అవకాశం లభిస్తుంది? అని మాజీ మంత్రి ప్రశ్నించారు.
అత్యంత దారుణం: డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే
టెట్ ప్రశ్నాపత్రాల లీకేజీ అత్యంత దారుణంగా ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అభివర్ణించారు. దీని సూత్రధారులపై కఠినమైన చర్యలు తీసుకునేందుకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో మాట్లాడతానని ఆయన తెలిపారు. ఈ లీకేజీపై క్షుణ్ణంగా, నిష్పక్షపాతంగా, అత్యంత కఠినంగా దర్యాప్తు జరుపుతామన్నారు.
నిందితుల హోదాలతో సంబంధం లేకుండా.. వారిని వదిలిపెట్టబోమని ఆయన స్పష్టం చేశారు. నిఘా సమాచారం ఆధారంగా పోలీసులు వెంటనే దాడులు నిర్వహించి, లక్షలాది మంది కష్టపడి పనిచేసే నిజాయితీ గల అభ్యర్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడకుండా పోలీసులు కాపాడారని షిండే ప్రశంసించారు.






