28 June, 2026 | 1:54 AM

తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే

28-06-2026 12:48 AM
  1.   3 కార్పొరేషన్‌లలో బీజేపీ జెండా ఎగరవేస్తాం
  2. నేడు నాంపల్లి గ్రౌండ్‌లో విజయ సంకల్ప సమ్మేళనం
  3.   15 వేల మంది బూత్‌స్థాయి అధ్యక్షులు, ఏజెంట్లతో సమావేశం
  4. దిశానిర్దేశం చేయనున్న జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్
  5. ఏర్పాట్లను పరిశీలించిన బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు

హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని, గ్రేటర్ హైదరాబాద్ మూడు కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో 15 వేల మంది బూత్‌స్థాయి అధ్యక్షులు, ఏజెంట్లతో నిర్వహించే విజయ సంకల్ప సమ్మేళనానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ముఖ్యఅతిథిగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారని తెలిపారు.

శనివారం దీనికి సంబంధించిన ఏర్పాట్లను రాంచందర్ రావు సమీక్షించి, మీడియాతో మాట్లాడారు. బీజేపీ తదుపరి లక్ష్యం తెలంగాణ అని ఇప్పటికే తమ నాయకత్వం స్పష్టం చేసిందన్నారు.

ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇదే విషయాన్ని బలంగా చెప్పారని, రాబోయే ఎన్నికల్లో తెలంగాణ అధికారమే లక్ష్యంగా పోరాటానికి ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలనే సంకల్ప నినాదం ఈ వేదిక నుంచి వినిపిస్తామన్నారు.

ఇది కేవలం జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్ నగరానికి మాత్రమే పరిమితమైన కార్యక్రమం కాదని, తెలంగాణ మొత్తం రాజకీయ భవిష్యత్తుకు ఇది నాంది పలుకనుందని అన్నారు. ఇక్కడి నుంచి రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ బలోపేతానికి కొత్త దిశ నిర్ణయించ బడుతుందన్నారు. 

ఆ మూడు పార్టీలు కలిసినా అడ్డుకోలేవు..

ప్రధాని నాయకత్వంలో దేశం వికసిత భారత్ దిశగా వేగంగా పయనిస్తోందని, అదే వికసిత సంకల్పంతో తెలంగాణలో కూడా బీజేపీ ముందుకు సాగుతోందన్నారు. జీహెచ్‌ఎంసీతోపాటు మల్కాజిగిరి, సైబరాబాద్- కార్పొరేషన్‌లలో బీజేపీ ఘన విజయాన్ని నమోదు చేస్తుందనే పూర్తి నమ్మకం తమకు ఉందన్నారు. తమ కార్యకర్తల్లో ఉత్సాహం కనిపిస్తోందని, తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు.

ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మూడు పార్టీలు కలిసినా కూడా బీజేపీని అడ్డుకోలేవన్నారు. ఈ మూడు పార్టీల అసలు స్వరూపం ప్రజలకు పూర్తిగా అర్థమైందని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పునకు ప్రత్యామ్నాయం బీజేపీయే అని స్పష్టం చేశారు. 

నితిన్ నబిన్ పర్యటన.. తెలంగాణకు కీలకం

జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ తెలంగాణలో మూడు రోజుల పర్యటనకు రాబోతున్నారని, ఈ పర్యటన తెలంగాణ బీజేపీకి అత్యంత కీలకమైనదన్నారు. ఆదివారం నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాల ద్వారా తెలంగాణలో పార్టీ సంస్థాగత బలం, కార్యకర్తల ఉత్సాహం, రాబోయే రాజకీయ దిశ స్పష్టంగా కనిపించబోతున్నాయని చెప్పారు. జూన్ 28న హైదరాబాద్‌కు చేరుకున్న అనంతరం నితిన్ నబిన్ శంషాబాద్‌లోని రంగారెడ్డి జిల్లా పార్టీ కార్యాలయానికి వెళ్తారన్నారు.

అక్కడి నుంచి రంగారెడ్డి జిల్లా పార్టీ కార్యాలయంతో పాటు మరో 9 జిల్లాల బీజేపీ కార్యాలయాలను వర్చువల్‌గా ప్రారంభోత్సవం చేయనున్నారని వెల్లడించారు. అనంతరం నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోని కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారన్నారు. ఈ సమావేశానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజగిరి, సైబరాబాద్ పరిధిలోని బూత్ లెవల్ అధ్యక్షులు, బూత్ ఏజెంట్లు, బీఎల్‌ఏ-2లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నగరంలోని ముఖ్య నాయకులు హాజరవుతారని తెలిపారు.

హైదరాబాద్ నగరంలో ఈ స్థాయిలో పార్టీ కార్యక్రమంలో పాల్గొనడం ఇదే మొదటిసార్నారు. ఈ కార్యక్రమం ద్వారా నితిన్ నబిన్ తెలంగాణ ప్రజలకు స్పష్టమైన రాజకీయ సందేశం ఇవ్వబోతున్నారని తెలిపారు. అదేవిధంగా వీబీఐటీ విద్యాసంస్థలో యువత, విద్యార్థులతో ప్రత్యేకంగా సంభాషించేందుకు కాన్‌క్లేవ్ నిర్వహిస్తున్నామని, ఇందులో దేశ భవిష్యత్తు, యువత పాత్ర, వికసిత భారత్ లక్ష్యంపై ఆయనతో చర్చించనున్నారని తెలిపారు.

ఇదే పర్యటనలో వరంగల్‌లో బూత్‌స్థాయి నాయకులతో జరిగే సమావేశంలో కూడా నితిన్ పాల్గొంటారని, అలాగే ఘట్‌కేసర్ సమీపంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు.  తాను రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత జరుగుతున్న తొలి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఇదేనని అన్నారు. కార్యక్రమం ఏర్పాట్లపై బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జ్ అభయ్‌పాటిల్, ఎంపీ రేఖాశర్మ సమీక్ష నిర్వహించారు. 

కేంద్ర ప్రభుత్వ విధానాలకు ఆకర్షితులై..

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చేరికల కార్యక్రమం జరిగింది. ఎయిర్‌లైన్ రంగానికి చెందిన ప్రముఖులు హరికృష్ణన్ ఎన్ రాంచందర్‌రావు సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ.. హరికృష్ణన్ ఎయిర్ ఇండియాలో పైలట్‌గా సేవలందిస్తున్నారని, సమాజంలో ఒక గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న వ్యక్తి పార్టీలో చేరడం సంతోషకరమన్నారు.

దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వ విధానాలకు ఆకర్షితులై వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, యువత, మేధావులు బీజేపీలో చేరుతున్నారన్నారు. ఇటీవల ఐటీ రంగానికి చెందిన పలువురు యువకులు కూడా పార్టీ సిద్ధాంతాలను మెచ్చి బీజేపీలో చేరారని తెలిపారు. ఇది పార్టీపై పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనమన్నారు. వివిధ వర్గాలు, విభిన్న వృత్తులకు చెందిన వారు సిద్ధాంతాలకు ఆకర్షితులై చేరుతున్న పరిస్థితిని ప్రస్తుతం మనం స్పష్టంగా చూస్తున్నామన్నారు.