28 June, 2026 | 2:26 AM

‘జీ రామ్ జీ’ని అంగీకరించం

28-06-2026 01:13 AM
  1. రాష్ట్రాల అధికారాలకు విఘాతం
  2. అవసరమైతే సుప్రీంకు వెళ్తాం.. తెలంగాణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకువస్తాం 
  3.   2న తుది నిర్ణయం 
  4. రాష్ట్ర క్యాబినెట్ సబ్ కమిటీ భేటీలో మంత్రి ఉత్తమ్  

హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి) : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం స్థానంలో  కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న వీబీజీ రామ్‌జీ చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం అంగీకరించబోదని నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ చట్టం రైతులు, గ్రామీణ పేదల ఉపాధిని దెబ్బతీసేలా ఉందన్నారు. వీబీజీ రామ్‌జీ పథకంపై రాష్ట్ర క్యాబినెట్ సబ్‌కమిటీ శనివారం రాష్ట్ర సచివాలయంలో సమావేశమైంది.

ఈ సమావేశంలో మంత్రి సీతక్క, వీడి యో కాన్ఫరెన్స్‌లో తుమ్మలనాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి, పంచాయతీ రాజ్ ప్రత్యేక కార్యదర్శి దానకిశోర్, కమిషనర్ దివ్య తదితరులు పాల్గొన్నారు. వీబీజీ రామ్‌జీ పథకంపై చర్చించారు. ఇది  ఉపాధిహామీ చట్టం సవరణ కాదని, సమాఖ్య స్ఫూర్తిపై జరుగుతున్న ప్రత్యక్ష దాడి అని మంత్రి ఉత్తమ్ విమర్శించారు.

రాష్ట్రాల అధికారాలను నిర్వీర్యం చేయాలన్న ప్రయత్నంలో భాగంగానే కేంద్రం ‘రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ పేదల భవిష్యత్తును తాకట్టు పెట్టే చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం తలవంచి అమలు చేయదు. ప్రజల ప్రయోజనాలే మాకు పరమావధి‘ అని ఉత్తమ్ స్పష్టం చేశారు. ఈ చట్టంలోని అనేక నిబంధనలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని న్యాయ నిపుణులు ఉపసంఘానికి వివరించారని తెలిపారు.

‘రాష్ట్రాల హక్కులను కాపాడేందుకు అవసర మై తే దేశ అత్యున్నత న్యాయస్థానం తలుపులు తడతాం. తెలంగాణ ఒక్కటే కాదు.. సమాఖ్య వ్యవస్థను విశ్వసించే ఇతర రాష్ట్రాలతో కలిసి ఉమ్మడి పోరాటానికి సిద్ధంగా ఉ న్నాం’ అని పేర్కొన్నారు. కర్ణాటక, కేరళం ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరిపి, ఉమ్మడి న్యాయపరమైన, రాజకీయ కార్యాచరణపై చర్చించాలని ఉపసంఘం నిర్ణయించినట్లు వెల్లడించారు.

సమావేశంలో పాల్గొ న్న దాదాపు 20 పౌరసంఘాలు కేంద్ర ప్రతిపాదనను వ్యతిరేకించాయని, తెలంగాణ రాష్ట్రం సొంతంగా ఉపాధిహామీ చట్టాన్ని  తీసుకురావాలని వారు సూచించారని మం త్రి ఉత్తమ్ తెలిపారు. అంతేకాకుండా 60 రోజుల ఉపా ధి పనిదినాల పరిమితిని పౌరసంఘాలు వ్యతిరేకించాయని, కనీసం 200 రోజులు పని కల్పించాలని, చట్టబద్ధ కనీస వేతనాలు చెల్లించాలని కోరాయని వివరించారు. 

తెలంగాణపై వేల కోట్ల భారం

కేంద్రం ప్రతిపాదించిన 60:40 నిధుల భాగస్వామ్యం ద్వారా తెలంగాణపై వేల కోట్ల రూపాయల అదనపు భారం పడే ప్రమాదం ఉందన్నారు. ఈ అంశాన్ని రాష్ట్ర న్యాయశాఖ పరిశీలనలో ఉందన్నారు. పనితీరు బాగున్న రాష్ట్రాలను శిక్షిస్తూ, వెనుకబడిన రాష్ట్రాలను ప్రోత్సహించేలా కేంద్రవిధానం ఉందన్నారు. ఈ చట్టంపై తెలంగాణ సర్కార్ ఇప్పటికే కేంద్రానికి పంపిన సమగ్ర సూచనలను కేంద్రం విస్మరించందని పేర్కొన్నారు. ‘తెలంగాణ ప్రజల హక్కులు, రాష్ట్ర రాజ్యాంగబద్ధ అధికారాలు, గ్రామీణ పేదల జీవనో పాధిని కాపాడటం మా బాధ్యత.

కేంద్రం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే తెలంగాణ చూస్తూ ఊరుకోదు’ అని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. ఈ అంశంపై జూలై 2న జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటా మని వెల్లడించారు. అవసరమైతే రాష్ట్ర చట్టం తీసుకురావడం, సుప్రీంకోర్టును ఆశ్రయించడం, ఇతర రాష్ట్రాలతో కలిసి ఉమ్మడి కా ర్యాచరణ చేపట్టడం వంటి అన్ని ప్రత్యామ్నాయాలను  పరిశీలిస్తున్నట్లు తెలిపారు.