రాబందుల పాలన వచ్చె..
- ఆదిలాబాద్ రైతు గణపతిది ఆత్మహత్య కాదు
- ముమ్మాటికీ రేవంత్‌రెడ్డి సర్కార్ చేసిన హత్యే
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, మార్చి 22 (విజయక్రాంతి) : తెలంగాణలో రైతుబంధు పాలనపోయి.. రాబందుల పాలన వచ్చిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు మండిపడ్డారు. పండించిన పంటను కాంగ్రెస్ సర్కారు కొనకపోవడంతో నానాకష్టాలు పడుతున్న రైతన్నల గోడు తెలుసుకునేందుకు గత నవంబర్ 18 తేదీన తను స్థానిక బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్‌కు వెళ్లానని, అంతకు ముందురోజే మీడియాతో తన కష్టాలు చెప్పు కుంటూ ఆదిలాబాద్ జిల్లా ఆర్లీ(బీ)కి గ్రామానికి చెందిన తుడుం గణపతి కళ్లనీళ్ల పర్యంతం అయ్యారని గుర్తుచేశారు.
నాలుగు రోజులుగా మార్కెట్ యార్డులో ఉంటున్నా తన సోయాబీన్ పంటను కొనడంలేదని ఆవేదన వ్యక్తంచేశారని, కాంగ్రెస్ సర్కారు ఇట్లాగే పంటను కొనకుండా వేధిస్తే, తనకు మరణం తప్ప మరోమార్గం లేదని రోదించారని తెలిపారు.
రుణమాఫీ కాక, రైతు భరోసా రాక, అప్పుల బాధ తీవ్రమై మూడు రోజుల క్రితం గణపతి ఆత్మహత్య చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆది వారం ట్విట్టర్ వేదికగా కేటీఆర్ స్పం దించారు. రైతు గణపతిది ఆత్మహత్య కాదన, ముమ్మాటికీ రేవంత్ సర్కారు చేసిన హత్యనే అని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.




