చినుకు పడితే చిత్తడే...
గుంతల్లో నిలుస్తున్న నీరు
బురదమయమైన రోడ్లు
దుర్భరంగా పల్లె రహదారులు
కోటపల్లి, జూలై 5: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో పలు గ్రామాలకు కలి పే ప్రధాన రహదారి వర్షాల కారణంగా పూర్తిగా దెబ్బతిని ప్రజలకు శాపంగా మారింది. తేలికపాటి చినుకులు పడినా ఆ రోడ్డు వెంట వెళ్లాలంటే వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. గ్రామాల్లో సైతం ఇలాంటి పరిస్థితులే దాపురిస్తున్నాయి. అడుగడుగునా భారీ గుంతలు, వాటిలో నిలిచిపోయి న వర్షపు నీరు, బురదతో రహదారి ప్రమాదకరంగా మారింది. ఈ మార్గంలో ప్రయాణం చేయాలంటే ఎక్కడ వాహనం అదుపుతప్పుతుందోనని వాహనచోదకులు, నడిచి వెళ్లే వారు ప్రాణాలను పణంగా పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది.
కోటపల్లి మండల కేంద్రం నుంచి పారుపల్లి గ్రామానికి వెళ్లే ఈ రహదారిపై ప్రతి రోజు వందల సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. ఈ రహదారి వెంటనే వివిధ గ్రామాల విద్యార్థులు, రైతులు మండల కేంద్రానికి వెళుతుంటారు. రహదారి బురదమయమవుతుండటంతో సుమారు ఎనిమి ది గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ద్విచక్ర వాహనదారులైతే వాహ నాలు బురదలో జారిపడి ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు కోకొల్లలని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న వర్షానికే రహదారి ఇలా తయారైతే భారీ వర్షం కురిస్తే గ్రామాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి అని వాపోతున్నారు.
అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్లు, ఇతర అత్యవసర సేవల వాహనాలు కూడా ఈ రహదారిపై వెళ్లలేని దుస్థితి నెలకొందని, ఏదైనా అపశృతి జరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇంతటి దయనీయ పరిస్థితి నెలకొన్నప్పటికీ సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటి వరకు స్పందించకపోవడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఇబ్బందులు కండ్లకు కనిపించడంలేదా..? సమస్య మరింత తీవ్రమయ్యే వరకు ఎదురుచూడాలా..? అంటూ నిలదీస్తున్నారు. ఇప్పటికైనా మంత్రి స్పందించి రహదారికి అత్యవసర మరమ్మతులు చేపట్టాలని, నాణ్యమైన శాశ్వత రహదారిని నిర్మించి ప్రజలకు సురక్షిత రాకపోకలు కల్పించాలని కోటపల్లి మండల ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.






