9 May, 2026 | 2:33 AM

జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

09-05-2026 01:25 AM
  1. అధికారుల సమన్వయ కృషితో జిల్లాను అగ్రగామిగా నిలపాలి
  2. అక్షర మాలలో వెలిగిన ములుగు జిల్లా
  3. పదో తరగతి ఫలితాలలో ర్యాంకులు సాధించిన విద్యార్ధులకు ఘన సన్మానం
  4. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి  ధనసరి అనసూయ సీతక్క

ములుగు, (మహబూబాబాద్) మే 8 (విజయక్రాంతి): ములుగు జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే ముఖ్య లక్ష్యంగా, అధికారుల సమన్వయంతో ములుగు జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా నిలపాలని, ఇటీవల విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో ములుగు జిల్లా అక్షర మాలలో వెలిగి ఇతర జిల్లాలకు ఆదర్శప్రాయంగా నిలవడం గర్వకారణంగా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి  ధనసరి అనసూయ సీతక్క తెలిపారు.

శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, డి ఫ్ ఓ వికాస్ మీనా లతో కలిసి జిల్లా అభివృద్ధి పనుల పురోగతిపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాలలో రాష్ట్ర, జిల్లా స్థాయిలో  ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను శాలువలతో సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి అనసూయ సీతక్క మాట్లాడుతూ జిల్లా సమగ్ర అభివృద్ధిని సాధించడంతో పాటు, ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుందని, ఇందులో భాగంగా ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యలను నేరుగా పరిష్కరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు.

త్వరలోనే ప్రజా దర్బార్ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదుల స్థితిగతులపై పూర్తిస్థాయిలో ప్రత్యేక అధికారిని నియమిస్తామని తెలిపారు. పెండింగ్లో ఉన్న ప్రజా సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. నూతన గ్రామపంచాయతీ భవనాలకు అంచనాలను సిద్ధం చేసి యుద్ధ ప్రతిపాదికన పూర్తిచేయాలని, గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా  చూడాలన్నారు. మౌలిక వసతులైనటువంటి కరెంటు, డ్రైనేజీ, తాగునీటి వంటి అత్యవసర పనులకు మాత్రమే నిధులకు ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠశాలలు, వసతి గృహాలు పున ప్రారంభం అయ్యేలోపు వాటిలోని సమస్యలను మరమ్మత్తు పనులను గుర్తించి వెంటనే పరిష్కరించాలన్నారు.

అటవీ ప్రాంతాలలో ఉండే గ్రామాలలో కనీస సౌకర్యాల విషయంలో అటవీ అధికారులు గిరిజనులను ఇబ్బందులకు గురి చేయవద్దని త్వరలోనే ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించడం జరుగుతుందని స్పష్టం చేశారు. అంతరించిపోయే వృక్షజాతులు, వివిధ రకాల పండ్ల మొక్కలతో ప్రత్యేకంగా పార్క్ ఏర్పాటు చేసే విధంగా చూడాలని, ఎక్కువ సంఖ్యలో ఇప్ప చెట్లను పెంచే విధంగా చూడాలన్నారు.

మేడారం మహా జాతరలో అద్భుతాలు సృష్టించిన మహిళా సంఘాల సభ్యులు అదే స్ఫూర్తితో రాబోయే గోదావరి పుష్కరాలకు కూడా ప్రత్యేక స్టాల్స్ నిర్వహించుకోవడానికి ముందుకు రావాలని డి ఆర్ డి ఏ ద్వారా వారికి సహాయ సహకారాలు ప్రోత్సాహం అందించడం జరుగుతుందని తెలిపారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులను అప్రమత్తంగా ఉండే విధంగా సూచనలు జారీ చేయాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. పదవ తరగతి పరీక్ష ఫలితాలలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఉద్దేశిస్తూ మంత్రి మాట్లాడుతూ అక్షరమాలలో ములుగు జిల్లాను ర్యాంకులతో వెలిగించినందుకు కృషిచేసిన విద్యార్థులను, తల్లిదండ్రులను ఉపాధ్యాయులను, అధికారులను అభినందించారు. 

ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు ఉండే డిమాండ్ కలిగిన మంచి సబ్జెక్టులలో ఉన్నత విద్యను అభ్యసించాలని, అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి కష్టంతో కాకుండా ఇష్టంతో చదువుతూ తల్లిదండ్రులకు గ్రామానికి మంచి పేరును తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ సి.హెచ్. మహేందర్ జీ, ఆర్డీవో వెంకటేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎం పి డి ఓ లు, ఎం పి ఓ లు, తదితరులు పాల్గొన్నారు.