18 April, 2026 | 6:11 AM

మామిడి సీజన్ వచ్చేసింది

18-04-2026 01:22 AM
  1. బాటసింగారం మార్కెట్ కు బారులు కట్టిన వాహనాలు

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక ఇతర రాష్ట్రాల నుంచి  మామిడి రాక ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు 

మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసాం : గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి 

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు : ఎల్ శ్రీనివాస్  గడ్డి అన్నారం మార్కెట్ కార్యదర్శి

అబ్దుల్లాపూర్ మెట్, ఏప్రిల్ 17: పండ్లకు రారాజు అయినా  మామిడి సీజన్ వచ్చింది. మార్కెట్ లో మ్యాంగో హవా మొదలైంది. హైదరాబాద్ శివారు ప్రాంతమైన బాటసింగారంలోని గడ్డి అన్నారం పండ్ల మార్కెట్కు మామిడి కాయల రాక క్రమంగా పెరుగుతూ ఉంది  రాష్ట్రంలో అతిపెద్ద పండ్ల మార్కెట్ కావడంతో రైతులు, వర్తకులు, చిరు వ్యాపారులు, వినియోగదారులతో సందడి వాతావరణం నెలకొంది.

ఈ ఏడాది ధరలు కొంత ఆశాజనకంగా ఉండటంతో క్రయ, విక్రయాలు ఊపందుకుంటున్నాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మార్కెట్ లో మామిడి క్రయ విక్రయాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.  

బాటసింగారం మార్కెట్ లో మామిడి కుప్పలతో నిండిపోయాయి. ఆంధ్రప్రదేశ్  కర్ణాటక, తెలంగాణలోని అల్లాపూర్, గద్వాల్, రంగారెడ్డి నల్గొండ, వరంగల్, సూర్యాపేట్, మహబూబ్నగర్, తిమ్మాజీపేట్, కరీంనగర్, వికారాబాద్, అనంతపూర్, పరిగి, వనపర్తి, యాదగిరిగుట్ట, అంకిరావుపల్లి, చారకొండ తదితర  ప్రాంతాల నుంచి మామిడి లోడ్లతో లారీలు, గూడ్స్ వాహనాలు, ఆటో ట్రాలీలు పండ్ల మార్కెట్ కు తరలివస్తున్నాయి.  

ఇప్పటివరకు సుమారు 2,48, 219 క్వింటాళ్లు దిగుమతులు ఎగుమతులు జరిగాయి. నాణ్యతనుబట్టి టన్నుకు సగటున రూ.30 వేల నుంచి రూ.40 వేల ధర పలు కుతోంది. మంచి రకాలకు క్వింటా 1 లక్ష పలుకుతుంది. మార్కెట్ కు వచ్చిన మామిడిని  రాజస్థాన్, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, హర్యానా తదితర రాష్ట్రాలకు ఎగుమతులు చేస్తున్నారు.

బాటసింగారంలోని గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కు ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి బెనిషాన్, తోతా పూరి, హిమాయత్, నాతి, పెద్ద రసాలు, చిన్న రసాలు, సుందరి, మల్లిక, కేసరి, దాసేరి, అప్పుసా తదితర రకాల   మామిడి పండ్లు దిగుమతి అవుతున్నట్లు అధికారులు తెలిపారు. వీటిల్లో అత్య ధిక ధర హిమాయత్ రకం కిలో రూ.200 ధర పలు కుతుండగా, అత్యల్పంగా నాటి రకం కిలో రూ.8-14 ధర పలుకుతోంది. వీటిలో చెట్టుపైనే కవర్ కట్టిన పండ్లకు అధిక డిమాండ్ ఉండడంతో పాటు ధర కూడా టన్నుకు రూ. లక్ష వరకు పలుకు తోందని అధికారులు పేర్కొంటున్నారు. 

మౌనిక సదుపాయాలు ఏర్పాట్లు చేశాం 

మార్కెట్ లో క్రయవిక్రయాలు సజావుగా సాగే విధంగా, ఎలాంటి ఇబ్బందులకు లేకుండా ఏర్పాట్లు చేశాం.  మార్కెట్ ప్రాంగణంలో మామిడి పండ్లతో వచ్చే వాహనాలు సాఫీగా రాక పోకలు సాగించేలా అంతర్గత రోడ్లు నిర్మించాం. మార్కెట్ లో రైతులు, వ్యాపారులు దాహం తీర్చుకునేందుకు చల్లటి తాగునీటి యంత్రాలు ఏర్పాట్లు చేశాం.

చిలుక  మధుసూదన్ రెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్

అతిక్రమిస్తే చర్యలు తప్పవు 

మామిడిని ప్యాకింగ్ చేసే క్రమంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు అనుమతులు ఇచ్చిన ప్రకారమే ఇథలిన్ ప్యాకెట్లను మోతాదులో వాడే విధంగా వ్యాపారులకు సూచనలు చేశాం. నిబంధనలను అతిక్రమిస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన  చర్యలు తీసుకుంటాం 

ఎల్ శ్రీనివాస్, గడ్డి అన్నారం మార్కెట్ కార్యదర్శి