పటాన్‌చెరు పోస్టుకు సప‘రేటు’..!
పోస్టింగుల కోసం జోరుగా పైరవీలు
ఇక్కడ పని చేయాలంటే
అధికారులకు ప్రత్యేక ఆసక్తి
కీలక శాఖల పోస్టింగులకు భారీ డిమాండ్
బంగారుబాతుగా మారిన నియోజకవర్గం
పటాన్చెరు, ఏప్రిల్ 17: పటాన్చెరు నియోజకవర్గంలో పలు శాఖల్లో పోస్టింగ్ పొందడం బంగారుబాతుగా మారింది. నియోజకవర్గంలో ఎక్కడైనా పోస్టింగ్ పొందడానికి ఉద్యోగులు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇందుకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ పోస్టింగ్ పొందుతున్నారనే ప్రచారం సాగుతోంది.
ఈ ప్రాంతంలో బదిలీ లేదా పోస్టింగ్ కావాలంటే లక్షల రూపాయలు సైతం ఖర్చు చేయడానికి వెనుకంజ వేయడం లేదని సమాచారం. ఇతర ప్రాంతాలకు బదిలీ కాకుండా కొంతమంది అధికారులు ఇక్కడే కొనసాగేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేయడానికి కూడా వెనుకాడడం లేదు.
మరో విషయం ఏమిటంటే ఇక్కడే పాతుకుపోయిన అధికారులు నియోజకవర్గంలోని ఇతర మండలాలకు బదిలీ చేయించుకోవడం..తిరిగి మళ్ళీ పైరవీ చేసుకొని యధాస్థానానికి రావడం జరుగుతుందే తప్ప నియోజకవర్గం దాటి మాత్రం వెళ్ళడం లేదు. దీనివెనుక రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాలు ఉండడమేనని ప్రజలు విమర్శిస్తున్నారు.
పోలీసు, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ పోస్టులకు డిమాండ్..
ప్రధానంగా పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్, జీహెచ్‌ఎంసీ వంటి కీలక శాఖలలో పోస్టింగులకు భారీ డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు అధికారులు ఇక్కడే బదిలీలు చేయించుకుని సంవత్సరాలుగా కొనసాగుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఒకసారి ఇక్కడ పనిచేసిన అధికారులు మళ్లీ ఇదే ప్రాంతానికి రావాలనే ఆసక్తి చూపుతున్నారనే చర్చలు కూడా వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా ఇరిగేషన్ శాఖలో కొంతమంది అధికారులు దీర్ఘకాలంగా కొనసాగుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులపై అవినీతి ఆరోపణలు వచ్చినా బదిలీలు జరగడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల ఓ మున్సిపల్ కమిషనర్ జీహెచ్‌ఎంసీ నుంచి తిరిగి మున్సిపాలిటీకి రావడం కూడా చర్చనీయాంశంగా మారింది.
నిజాయితీగా పనిచేసే అధికారులకు మాత్రం ఇక్కడ పోస్టింగ్ రావడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల అనంతరం అధికారుల బదిలీలపై చర్చ మొదలైంది. దీంతో పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ శాఖల్లో పోస్టింగుల కోసం అధికారులు భారీగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఎంత ఖర్చు కైనా వెనకాడడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.






