18 April, 2026 | 6:11 AM

అదనంగా మూడు మక్కల కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

18-04-2026 01:12 AM

మహబూబాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): ‘అన్నదాతకు అరిగోస’ శీర్షికతో మక్కలు, ధాన్యం కొనుగోళ్ల కోసం రైతులు పడుతున్న ఇబ్బందులపై శుక్రవారం ‘విజయక్రాంతి’ పత్రికలో ప్రచూరించిన వార్తా కథనానికి అధికారులు స్పందించారు.

మక్కల కొనుగోళ్లకు జిల్లా వ్యాప్తంగా అదనంగా మరో మూడు కొనుగోలు కేంద్రాలకు రాష్ట్ర మార్క్ఫెడ్ సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిల్లాలోని నెల్లికుదురు మండలం ఆలేరు, గూడూరు మండలం కొల్లాపురం, కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామాల్లో కొత్తగా మక్కల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని మార్క్ఫెడ్ సంస్థ సొసైటీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీనితో మక్కలు పండించిన రైతులకు కొంతమేర ఊరటగా మారనుంది. 

పగడ్బందీగా మక్కల కొనుగోళ్లు..

కేసముద్రం వ్యవసాయ మార్కెట్ లో మక్కల కొనుగోళ్లకు పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి తెలిపారు. ఇటీవల కేసముద్రం మార్కెట్ యార్డులో మార్క్ఫెడ్ సంస్థ ద్వారా మక్కల కొనుగోళ్లలో పడ్డ ఇబ్బందుల నేపథ్యంలో అధికార యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు 80 వేల బస్తాల మక్కల కొనుగోళ్లను పూర్తిచేసిన తర్వాత, సోమవారం నుండి మార్కెట్ యార్డులో మక్కల కొనుగోళ్లకు క్రమ పద్ధతిలో నిర్వహించడానికి చర్యలు చేపట్టారు.

కేసముద్రం మండల పరిధిలోని తాళ్ల పూసపల్లి, కేసముద్రం మార్కెట్ యార్డులో మక్కల కొనుగోళ్లకు ఒక్కసారిగా అనుమతించకుండా, మండల పరిధిలోని గ్రామాలకు చెందిన రైతులు క్రమ పద్ధతిలో పండించిన మక్కలను తీసుకువచ్చి విక్రయించే విధంగా విధివిధానాలను ఖరారు చేశారు.

రైతులకు గ్రామాల వారిగా కేటాయించిన తేదీల్లోనే రైతులు మక్కలను తీసుకురావాల్సి ఉంటుందని, ప్రభుత్వం నిర్దేశించిన విధంగా మక్కలను బాగా ఆరబెట్టి, 14 శాతం తేమ మించకుండా, తాలు చెత్తాచెదారం లేకుండా బాగా శుభ్రం చేసి తీసుకువచ్చి క్వింటాల్ కు 2400 రూపాయల మద్దతు ధర పొందే విధంగా సహకరించాలని కోరారు. శుక్రవారం మార్కెట్ యార్డులో నిర్వహించిన సమావేశంలో ఎంపీడీవో క్రాంతి, ఎస్ ఐ క్రాంతి కిరణ్, ఎవో వెంకన్న, సొసైటీల సీఈఓ లు మల్లారెడ్డి, ఎల్లయ్య, మార్కెట్ గ్రేడ్ 3 కార్యదర్శి రాజేంద్రప్రసాద్, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.