30 July, 2026 | 1:54 AM

హైడ్రా కమిషనర్‌ను బర్తరఫ్ చేయాలి

30-07-2026 12:45 AM

ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్ జూలై 29 (విజయక్రాంతి): హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ను వెంటనే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైడ్రా వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యాన్ని బట్టబయలు చేశాయని ఆయన విమర్శించారు.

బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజల ఇళ్లను కూల్చివేసే విషయంలో హైడ్రా అపార అధికారాలు విని యోగించినప్పటికీ, చట్టం ముందు మాత్రం పూర్తిగా విఫలమైందన్నారు. కోర్టు ఆదేశాలు, న్యాయపరమైన విధానాలను పట్టించుకోకుండా వ్యవహరించే అధికారులను ప్రభుత్వం వెనుకేసుకురావడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని మండిపడ్డారు.

హైడ్రా పేరుతో పేదలు, మధ్యతరగతి ప్రజల ఇళ్లపై బుల్డోజర్లు నడిపించి వేలాది కుటుంబాలను రోడ్డున పడేసిన ప్రభుత్వం, ఇప్పుడు హైకోర్టు వ్యాఖ్యలతో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఒకరికి ఒక న్యాయం, మరొకరికి మరో న్యాయం అనే విధంగా వ్యవహరించడం కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.బీఆర్‌ఎస్ పార్టీ మొదటి నుంచే హైడ్రా చర్యలు చట్ట పరిరక్షణ కోసం కాకుండా రాజకీయ కక్షసాధింపుకు ఉపయోగపడుతున్నా యని హెచ్చరిస్తూ వచ్చిందని, ప్రస్తుతం హై కోర్టు చేసిన వ్యాఖ్యలు ఆ అంశాలపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తాయని పేర్కొన్నారు. కోర్టు ధిక్కరణ కింద అనేక కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. ప్రభుత్వం వెంటనే రంగనాథ్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశా రు. హైడ్రా పేరిట జరిగిన కూల్చివేతలు, అధికార దుర్వినియోగ ఆరోపణలపై హైకోర్టు పర్యవేక్షణలో లేదా స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలని కోరారు.