18 April, 2026 | 3:19 AM

హైబ్రిడ్ ఫార్ములా అసదుద్దీన్‌ది

18-04-2026 01:47 AM
  1. మహిళల హక్కుల వ్యతిరేక పార్టీ మజ్లీస్
  2. మత ఛాందసవాదంతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ను మజ్లీస్ ఏకం చేస్తోంది
  3. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): ‘సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హైబ్రిడ్ ఫార్ములా.. మజ్లిస్, కాంగ్రెస్ హైబ్రిడ్ ఫార్ములా.. ఈ ఫార్ములాను మజ్లిస్ పార్టీ తయారు చేసింది.. కాంగ్రెస్ పార్టీకి చెప్పింది అసదుద్దీన్ ఒవైసీ..అందుకే నిన్న అసదుద్దీన్ ఒవైసీ కూడా పార్లమెంటులో రేవంత్‌రెడ్డి ఫార్ములాను ప్రశంసించారు’ అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ప్రధానంగా దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని, సీట్లు తగ్గుతాయని.. దక్షిణాదికి, ఉత్తరాదికి యుద్ధం వస్తుందని పార్లమెంటు వేదికగా విపక్షాలు బాధ్యతారాహిత్యంగా మాట్లాడాయని తెలిపారు.

శుక్రవారం ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలోని కిషన్‌రెడ్డి మాట్లాడారు. కేంద్రప్రభుత్వం దేశంలో అనేకరోజులుగా జరుగుతున్నటువంటి చర్చ, డిమాండ్లు, ఒత్తిడులు, తీర్మానాలను దృష్టిలో పెట్టుకుని.. వివిధ రాజకీయ పార్టీలు, విద్యావంతులు, మేధావులతో చర్చలు జరిపి.. మహిళారిజర్వేషన్ బిల్లుకు సవరణ, నియోజకవర్గాల పునర్వవిభజన వంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చిందన్నారు.

అయితే విపక్షాలు అనవసరంగా, బాధ్యతారాహిత్యంగా, రాజకీయ దురుద్దేశంతో వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు. ఏ రాష్ట్రానికీ ఎలాంటి అన్యాయం జరగదని లోక్‌సభ వేదికగా ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్‌షా, కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టమైన సందేశాన్నిచ్చారన్నారు. అయినా విపక్షాలు పార్లమెంటు వేదికగా తప్పుడు ప్రచారం చేశాయన్నారు. కానీ ఇవాళ మోదీ ప్రభుత్వం దక్షిణాదిలో సీట్లు తగ్గకుండా..

ప్రజల సెంటిమెంటును గుర్తించి 50 శాతం పెంపు ఫార్ములా తీసుకొచ్చిందన్నారు. అయినా.. విపక్షాలకు సంతృప్తి కలగలేదన్నారు. ఏ కారణంతో వ్యతిరేకించాలో తెలియకుండా.. గుడ్డిగా కొత్త ఫార్ములాను వ్యతిరేకిస్తున్నారన్నారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తే.. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే.. దేశంలోని అన్ని ప్రాంతాల్లో మహిళలతో సహా పురుషుల్లోనూ కొత్త నాయకత్వం వస్తుందనే భయం విపక్షాల్లో ఉందని, అదే జరిగితే..

తరతరాలుగా కుటుంబాల చేతుల్లో ఉన్నపార్టీల నాయకులకు వారి ప్రాబల్యం తగ్గుతుందనే భయం వారిలో నెలకొందన్నారు. బడుగు బలహీన వర్గాలకు అధికారం దక్కొద్దనే భయంతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఇతర రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నాయని చెప్పారు. మొదట్నుంచి కూడా.. మహిళలకు ఎటువంటి రిజర్వేషన్లు ఉండొద్దనేది మజ్లిస్ పార్టీ కుట్ర అన్నారు. హైదరాబాద్‌లో సీట్ల పునర్విభజన జరిగితే.. తమ సీట్లకు ఎక్కడ ముప్పువస్తుందో అనే భయంతో.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కలిపి కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు.

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి 70 శాతం రెవెన్యూ వస్తోందని, మిగిలిన జిల్లాలకు కోతపెట్టి.. హైదరాబాద్, రంగారెడ్డిలోనే సీట్లు పెంచాలని రేవంత్, అసదుద్దీన్, కేటీఆర్ కోరుతున్నారా? అని ప్రశ్నించారు. మిగిలిన జిల్లాల్లో సీట్లు పెరగాల్సిన అవసరం లేదా? అనేది ఈ ముగ్గురూ సమాధానం చెప్పాలన్నారు. మజ్లిస్ పార్టీ మహిళల హక్కులకు వ్యతిరేకమైన పార్టీ అని, మహిళలకు ఎటువంటి అధికారాలు, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా దక్కకూడదని కుట్రలు చేస్తున్న పార్టీ మజ్లిస్ అన్నారు.

మతఛాందసవాదంతో మజ్లిస్ పార్టీ కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ను ఏకం చేస్తోంది’ అన్నారు. మోదీ ఇచ్చిన ఫార్ములాతో దక్షిణాదికి న్యాయమా? అన్యాయమా అని బహిరంగంగా చర్చించేందుకు సవాల్ విసురుతున్నానని, అయితే.. వితండవాదం లేకుండా చర్చకు రావాలన్నారు. ‘ఏపీ విభజన బిల్లులో.. తెలంగాణలో అసెంబ్లీ స్థానాలను 119 నుంచి 153కు, ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ స్థానాలను 175 నుంచి 225కు పెంచాలని పేర్కొన్నారు కదా.

మరి దీనికి ఏ ఫార్ములా అనుసరించారో కాంగ్రెస్ నాయకులు, సీఎం రేవంత్‌రెడ్డి చెప్పగలరా?’ అన్నారు. కాంగ్రెస్, ఇతర పక్షాల నేతలు మహిళాబిల్లును, డీలిమిటేషన్ బిల్లును ఎందుకు వ్యతిరేకించారని తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు ప్రశ్నించాలని విజ్ఞప్తి చేశారు. ఈ బిల్లును ఎవరెవరు అడ్డుకున్నారో ప్రజలు గమనించారని, దీన్ని వ్యతిరేకించిన వారంతా చరిత్రహీనులుగా మిగిలిపోతారని విమర్శించారు.