ప్రజలు వ్యతిరేకించే పరిస్థితి తెచ్చుకోవద్దు
- ఇండియా కూటమి కళ్లు తెరవాలి
మహిళా బిల్లు ఆమోదం పొందితే ఎంతో మేలు
దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో వెనుకబడ్డ మహిళలు
లోక్‌సభలో మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): మహిళా బిల్లు ఆమోదం పొందితే అందరికీ పేరు వస్తుందని, ఇండియా కూటమి ఇప్పటికైనా కళ్లు తెరవాలని లోక్‌సభలో మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. శుక్రవారం లోక్‌సభలో ఎంపీ మాట్లాడారు. దశాబ్దాల కాలంగా మహిళలు రాజకీయంగా వెనుకబడ్డారని, మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందితే ప్రధాని నరేంద్ర మోదీకి, ఎన్డీయేకే క్రెడిట్ వస్తుందని భావించి వ్యతిరేకించొద్దని కోరారు.
డీలిమిటేషన్ సీట్ల పెంపు, నారీ శక్తి వందన్ అధినియం వ్యతిరేకించి, ప్రజలు మిమల్ని వ్యతిరేకించే పరిస్థితి తెచ్చుకోవద్దన్నారు. నాడు తెలంగాణ కోసం మాట్లాడని వాళ్ళంతా, నేడు సభలో తెలంగాణ గురించి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఏ రోజు పాల్గొనని వాళ్ళు ఇవాళ సభలో మాట్లాడుతుంటడం దురదృష్టకరమని విమర్శించారు.
2023లో బేషరతుగా మద్దతిచ్చాం..
పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన రోజు బేషరతుగా మద్దతు ఇచ్చిన పార్టీ బీజేపీ అని, మహిళల దశాబ్దాల కలను నిజం చేస్తూ.. 2023 సెప్టెంబర్‌లో నారీ శక్తి వందన్ అధినియం బిల్లు పార్లమెంట్‌లో పాస్ చేయించి, దేశ మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మహిళలందరి తరపున ధన్యవాదాలు తెలిపారు.
ఈ బిల్లు అమలులోకి రావడం వల్ల మహిళల గొంతులు చట్టసభల్లో మరింత బలంగా వినిపించే అవకాశం వస్తుందని, నిర్ణయాలలో సమతుల్యత వస్తుందన్నారు. వంటింటికి పరిమితం అయిన మహిళలు నేడు అన్ని రంగాలలో వారి సమర్థత చాటుతూ, భువి నుంచి దివి దాకా ఎదిగారని, చట్టసభల్లోకి మహిళలు రావడం దేశ ప్రగతికి అవసరమన్నారు. ప్రియాంక గాంధీ మహిళల సమాన హక్కుల గురించి మాట్లాడారని గుర్తు చేశారు. 1928లో మోతిలాల్ నెహ్రూ, 1925లో మహాత్మాగాంధీ దేశంలో మహిళల భాగస్వామ్యంపై మాట్లాడారని అన్నారు.
ఉప్పుసత్యాగ్రహంలో 70మంది మహిళలు పాల్గొన్నారని డీకే అరుణ చెప్పారు. ప్రియాంక గాంధీ కుటుంబం ఆలోచించడం మానేసి దేశం గురించి ఆలోచించాలని చురకలంటించారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, మహాత్మా జ్యోతిభాపులే, ఏపీజే అబ్దుల్ కలాం లాంటి ఎందరో మహానీయులు మహిళలకు సమాన హక్కులపై బలంగా వాదించారని చెప్పారు.
2029 నాటికి ఈ బిల్లును అమలు చేయాలనే దృఢమైన సంకల్పంతో ప్రధాని నరేంద్రమోదీ మహిళా సాధికారతపై ముందుకు రావడం హర్షణీయమన్నారు. రిజర్వేషన్ అమలు తరువాత మహిళలు ఆత్మగౌరవంతో, ఆత్మ విశ్వాసంతో రాజకీయాల్లో రాణిస్తారని ఎంపీ డీకే. అరుణ స్పష్టం చేశారు.






