28 June, 2026 | 1:54 AM

దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం

28-06-2026 12:54 AM

రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్

మలక్‌పేట్, జూన్ 27 (విజయక్రాంతి): దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర వయోవృద్ధుల, దివ్యాంగుల, ట్రాన్స్ జెండర్ ల సంక్షేమ శాఖ మంత్రి మంత్రి అడ్డూరి లక్ష్మణ్ అన్నారు.  మలక్పేట లోని వికలాంగుల సంక్షేమ రాష్ట్ర కార్యాలయంలో 146వ హెలెన్ కెల్లర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హెలెన్ కెల్లర్ విగ్రహాని కి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జీఓ 34 ప్రకారం  ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసే ఉద్యోగులకు బదిలీలో ఎంతో లబ్ధి పొందుతున్నారు అన్నారు. గత ప్రభుత్వం తొమ్మిదిన్నర ఇళ్లలో కేవలం 1500 మందికి పంపిణీ చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం అనతి కాలంలోనే 4000 మందికి స్కూటీలు, ఉపకరణాలను పంపిణీ చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్ళను నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని అర్హులైన దివ్యాంగులకు ఇందిరమ్మ ఇళ్లు అందే విధంగా కృషి చేస్తామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం  ప్రస్తుతం రూ.4,000గా ఉన్న దివ్యాంగుల పెన్షన్ను త్వరలో రూ.6,000 పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని హామీ ని ఇచ్చారు. వైకల్యం కేవలం శరీరానికి పరిమితం కావాలని... సంకల్పానికి అవరోధాలంటూ ఉండవని హెలెన్ కెల్లర్ జీవిత చరిత్ర ద్వారా స్పష్టంగా అర్థమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ముత్తినేని వీరయ్య, ముఖ్య కార్యదర్శి అనిత రామచంద్రన్, శాఖ డైరెక్టర్ బి శైలజ వివిధ దివ్యాంగ సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.