28 June, 2026 | 2:17 AM

మహిళలపై జరిగే లైంగిక వేధింపుల నివారణ చట్టంపై అవగాహన కలిగి ఉండాలి

28-06-2026 12:56 AM
  1. సీఐడీ డీజీపీ చారు సిన్హా 
  2. ప్రతి అధికారి మహిళ పోలీస్ సిబ్బందికి సురక్షితమైన వాతావరణం కల్పించాలి
  3. టీఎస్‌పీఏలో ప్రొబేషనరీ డీఎస్పీలకు మహిళల భద్రతపై ప్రత్యేక అవగాహన సమావేశం

రాజేంద్రనగర్ జూన్ 27 (విజయక్రాంతి) : మహిళలపై జరిగే లైంగిక వేధింపుల నివారణ చట్టంపై ప్రతి పోలీస్ అధికారికి  సమగ్రంగా  అవగాహన కలిగి ఉండాలని సిఐడి డిజిపి చారు సిన్హా తెలిపారు. తెలంగాణ పోలీస్ అకాడమీ సెమినార్ హాల్2లో శనివారం  ప్రొబేషనరీ డీఎస్పీ అధికారుల కు ‘పని ప్రదేశాల్లో మహిళల భద్రత  పోష్ చట్టం అమలు, మహిళలు ఎదుర్కొనే సమస్యలు‘ అనే అంశంపై ప్రత్యేక అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు  కార్యక్రమంలో మొత్తం 112 మంది ప్రొబేషనరీ డీఎస్పీలు పాల్గొన్నారు.

తెలంగాణ పోలీస్ అకాడమీ  డైరెక్టర్  అభిలాష్ బిస్త్,  ప్రత్యేక ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా సీఐడీ డీజీపీ చారు సిన్హా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  పని ప్రదేశాల్లో మహిళలపై జరిగే లైంగిక వేధింపుల నివారణ  చట్టం గురించి సమగ్రంగా వివరించారు. మహిళలు ఉద్యోగ స్థలాల్లో ఎదుర్కొనే అనేక రకాల లైంగిక వేధింపులు ప్రత్యక్షంగానే కాకుండా, మాటలు, ప్రవర్తన, సంకేతాలు లేదా ఇతర అనుచిత వ్యవహారాల రూపంలో కూడా ఉండవచ్చని తెలిపారు.

అలాంటి సంఘటనలను మహిళలు సకాలంలో గుర్తించి, చట్టపరంగా అందుబాటులో ఉన్న రక్షణ వ్యవస్థలను వినియోగించుకోవాలని ఆమె సూచించారు. వివిధ వాస్తవ ఉదాహరణల ద్వారా పోష్ చట్టం ప్రాముఖ్యతను వివరించి, ప్రతి అధికారి మహిళలకు సురక్షితమైన కార్యాలయ వాతావరణాన్ని కల్పించే బాధ్యతను గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. అనంతరం విమెన్ సేఫ్టీ వింగ్ కౌన్సిలర్ ఇషా శర్వాణి మహిళలు తమ ఉద్యోగ జీవితంలో ఎదుర్కొనే మానసిక, సామాజిక మరియు వృత్తిపరమైన సవాళ్లు, లైంగిక వేధింపుల వివిధ రూపాలు, వాటిని ఎదుర్కొనే విధానాలపై ఉదాహరణలతో  వివరించారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ సతీష్ లైజన్ అధికారిగా వ్యవహరించారు.