28 June, 2026 | 1:53 AM

ప్రత్యేక తెలంగాణలోనే బీసీలకు అన్యాయం

28-06-2026 12:54 AM
  1. రెండు రాష్ట్రాల్లోనూ అగ్రకులాలదే ఆధిపత్యం 
  2. ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలుకు జూలై 15న చలో హైదరాబాద్
  3. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్

నిజామాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): తెలంగాణ వచ్చి నంకనే బీసీలకు ఎక్కువ అన్యాయం జరుగుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం రాత్రి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కేర్ డిగ్రీ కళాశాలలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రెండు రాష్ట్రాల్లోనూ అగ్రకులాల ఆధిపత్యం నడుస్తుందన్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు కోసం జూలై 15న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు, బీసీ విద్యార్థులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపు నిచ్చారు.  రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు గడిచినప్పటికీ బీసీలకు మరింత అన్యాయం జరుగుతుందన్నారు.   త్యాగాలు బీసీ, ఎస్సీ, ఎస్టీలు చేస్తే ఈరోజు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో పిడికెడు శాతం లేని అగ్రకులాలు అనుభవిస్తున్నారని  తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం వస్తే దళితుడిని సీఎం చేస్తామని, బీసీని ముఖ్యమంత్రిని చేస్తామన్న పార్టీలు చివరికి దళిత, బీసీ మంత్రులను అవమాన పరిచే విధంగా బర్తరఫ్ చేశారన్నారు. 2008లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీమును ఎలాంటి నిబంధనలు లేకుండా అమలు చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ పథకాన్ని రద్దు చేసే కుట్ర పన్నుతున్నారన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ జూలై 2 న రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల బంద్ చేపడతామని అన్నారు.  సమావేశంలో  బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సు ధాకర్, దేవేందర్, ఆంజనేయులు, ఆకుల ప్రసాద్, కర్రీ రవీందర్, శంకర్ ,శ్రీలత, అపర్ణ, జయ, రేఖ, గంగాధర్, అజయ్, చంద్రకాంత్, సత్య ప్రకాష్, చంద్రమోహన్, హను మoడ్లు,  పాల్గొన్నారు.