30 April, 2026 | 2:12 AM

అన్నదాతకు అన్నింటా మోసం..

30-04-2026 01:09 AM
  1. నకిలీ విత్తనాలతో భారీగా నష్టం
  2. పుడమిని నమ్ముకున్న కర్షకునికి పుట్టెడు కష్టాలు
  3. రైతులపై నకిలీ విత్తనాల దెబ్బ
  4. బాన్సువాడ, నసరుల్లాబాద్, వర్ని మండలాల్లో వేయి ఎకరాల్లో పంట సాగు..
  5. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నష్టపోయిన రైతన్నలు..
  6. ఎకరాకు 5 క్వింటాళ్ల లోపు దిగుబడి రాకతో రైతుల్లో ఆందోళన

బాన్సువాడ, ఏప్రిల్ 29 (విజయ క్రాంతి): పుడమిని నమ్ముకొని పుట్టెడు కష్టాలు పడే రైతన్నకు అటు ప్రకృతి వైపరీత్యాలు,  ఇటు నకిలీ విత్తనాలు ఇవ్వలేనంతగా కుంగదీస్తున్నాయి. వడగండ్ల వానలు ఈదురు గాలులతో పంటలు దెబ్బతిని పోగా, నకిలీ విత్తనాల సాగుతో ఆశించిన స్థాయిలో దిగుబడులు రాక అన్నదాతలు  ఆందోళన పడే దుస్థితి ఏర్పడింది. రైతాంగాన్ని పట్టిపీడిస్తున్న నకిలీ విత్తనాల బెడద నాటి నుండి నేటి వరకు వదలడం లేదు. పైకం పోతుంది.. పంట పోతుంది... చివరికి రైతుల చేతిలో చిల్లి గవ్వ లేకుండా పోతుంది... గతంలో భూతల్లిని నమ్ముకుని ధాన్యపు సిరులను పండించిన రైతులు నేడు ఆరుగాలం కష్టించి పనిచేసిన ఫలితం లేకుండా పోవడంతో ఊసురుమంటున్నారు.

యాసంగి సీజన్లో ఎన్నో ఆశలతో పెట్టుబడులు పెట్టి పంట సాగుకు నడుంబిగించిన రైతులకు ఈసారి కూడా ఎదురుదెబ్బే తలిగింది. అకాల వర్షాలు వడగండ్ల వానలతో చేతికొచ్చిన పంటలు చేజారిపోగా, నకిలీ విత్తనాల సాగుతూ భారీగా నష్టాలను చవిచూసే పరిస్థితి ఏర్పడింది. రెండు రోజుల క్రితం వాతావరణం లో ఏర్పడ్డ మార్పుల వల్ల అతివేగంతో వీచిన  ఈదురు గాలులు, వడగండ్ల వర్షంతో వచ్చిన వరి ధాన్యం దిగుబడులను ఆరబోసుకున్న రైతులకు వడ్లన్నీ నానిపోయి తీరని కష్టాన్ని మిగిల్చింది.

మరోవైపు యాసంగిలో బ్రహ్మాండమైన దిగుబడులను ఆపాదించుకుంటామన్న నమ్మకంతో నకిలీ విత్తనాలతో వేసిన పంటలు పూర్తిగా నష్టాన్ని రుచి చూపించాయి. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు దిగుబడి రాకుంటే తమ కష్టం నీళ్ల పాలై తీవ్ర మనోవేదనకు గురవుతారు. ప్రకృతి వైపరీత్యాలతో ఇలా జరిగితే భరించవచ్చు.. కానీ విత్తన కంపెనీలు నాసీరకం విత్తనాలు ఇస్తే...? మూడు నెలల పాటు కష్టపడ్డా దిగుబడి రాకుంటే...? ఎవరు బాధ్యులు? ఇలాంటి సంఘటనలు ప్రతీ ఏడాది రాష్ట్రం లో ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం నకిలీ విత్తనాలు అమ్మే వారిపై పిడి యాక్టు పెట్టి లైసెన్స్ రద్దు చేస్తోన్నా వ్యాపారుల నడవడికలో ఎలాంటి మార్పు లేదు.

తాజాగా బాన్సువాడ, నస్రుల్లాబాద్, వర్ని మండలాల్లో రైతులు యాసంగిలో జేజీఎల్ 1798 రకం వరి విత్తనాలు వేయగా ఎకరానికి 5 క్వింటాళ్లు కూడా దిగుబడి రాలేదని రైతుల గగ్గోలు పెడుతున్నారు. సుమారు 1000 ఎకరాల్లో సాగుచేసిన  పంటలు నష్టపోయాయి. రైతుల ఫిర్యాదుతో వ్యవసాయ శాస్త్రవేత్తలు విత్తనాలు, పంట నమూనాలు సేకరించి తదుపరి పరీక్షకు తీసుకెళ్లారు. నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని ఏడీఏ అరుణ తెలిపారు.

ఓ కంపెనీకి చెందిన జేజీఎల్ 1798 పేరుతో ఉన్న విత్తనాలు వేసిన రైతులు వచ్చి ఫిర్యాదు చేసిన విషయం వాస్తవమేనని స్వయంగా అధికారిని అంగీకరించారు. దిగుబడి తక్కువగా ఉందని చెప్పడంతో వెంటనే ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలకు సమాచారం ఇచ్చామని, వారు వచ్చి విత్తనాలు, కొంత పంట, గింజలను పరీక్షలకు తీసుకెళ్లారని తెలిపారు. దిగుబడి ఎందుకు తక్కువ వచ్చింది... అనే అంశంపై నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని  ఆమె చెప్పారు.

బాన్సువాడ మండలం చింతల్నాగారం, హన్మాజీపేట, నస్రుల్లాబాద్ మండలం దుర్కి, మైలారం, వర్ని మండలం జలాల్పూర్ తదితర గ్రామాల రైతులు ఓ కంపెనీకి చెందిన జేజీఎల్ 1798 పేరుతో ఉన్న వరి విత్తనాలు వేశారు. తమకు ఎకరానికి 5 క్వింటాళ్ల దిగుబడులు కూడా రావడం లేదని రైతులు వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేశారు. పొలంలో ఒకే రోజు వేసిన పంట వివిధ దశల్లో ఉందని కర్షకులు చెబుతున్నారు. ఈ విత్తనాలు నియోజకవర్గంలో సుమారు వెయ్యి ఎకరాలకు సరఫరా అయినట్లు అధికారులు చెబుతున్నారు. రైతులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు జగిత్యాల నుంచి వ్యవసాయ శాస్త్రవేత్తలను పిలిపించి దిగుబడి రాకపోవడానికి కారణాలు తెలుసుకుంటున్నారు. 

కాగా, చేతికొచ్చిన వరిలో సరైన దిగుబడి రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులను మోసగించే నకిలీ విత్తనాల వ్యాపారులపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ తెరపైకి వస్తోంది. లోగడ కూడా ఇదే జరిగినప్పుడు రైతులు ఫిర్యాదు చేసిన ఎలాంటి ఫలితం కనిపించలేదని, కనీసం ఈసారైనా అధికారులు స్పందించి చర్యలకు ముందడుగు వేయాలని నష్టపోయిన రైతులు కోరుతున్నారు. మరి అధికారులు విత్తన వ్యాపారుల పట్ల ఎలాంటి చర్యలు తీసుకుంటారో... రైతుల పట్ల తగు న్యాయం ఏ విధంగా అందిస్తారో... వేచి చూడాల్సిందే.