30 April, 2026 | 2:18 AM

జిల్లా ద్వితీయ స్థానంలో మేకల జ్ఞానేశ్వరి

30-04-2026 01:09 AM

తిరుమలాయపాలెం ఏప్రిల్ 29 (విజయక్రాంతి): తిరుమలాయపాలెం మండల పరిధిలోని జల్లేపల్లి గ్రామానికి చెందిన మేకల జ్ఞానేశ్వరి తండ్రి సైదులు బుధవారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో పీఎంశ్రీ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల జల్లేపల్లిలో చదివి 581 మార్కులు సాధించి జిల్లా ద్వితీయ స్థానం, మండల ప్రథమ స్థానం సాధించి జిల్లాకు, మండలానికి, జల్లేపల్లి గ్రామానికి వన్నె తెచ్చింది. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆమెకు శాలువా కప్పి స్వీట్లు తినిపించి ఘనంగా సత్కరించారు.

గ్రామంలో బాణాసంచా కాల్చి సంబురాలు జరిపి పిల్లలకు స్వీట్లు పంచారు. గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు ఆమెను అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దారా రాజేష్ మాట్లాడుతూ ఇలాగే ఉన్నత విద్యను శ్రద్ధతో అభ్యసించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలు సాధించాలని ఆకాంక్షించారు. జల్లేపల్లి పాఠశాల నుండే భూక్య వెన్నెల/రవి ద్వితీయ స్థానం సాధించడంతో ఆమెను కూడా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు పార్థసారథి, మండల కాంగ్రెస్ నాయకులు పోట్ల కిరణ్ కుమార్, గ్రామ యూత్ కాంగ్రెస్ నాయకుడు తురక వేణు, పుల్లూరు మల్సూరు, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.