మహిళా బిల్లు ముసుగులో డీలిమిటేషన్ బిల్లు
- చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేకంగా బిల్లు పెట్టాలి
- బిల్లు వీగిపోవడం మోదీకి చెంపపెట్టు
- పులి కష్టం ఫామ్‌హౌస్‌కే పరిమితం
- పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): మహిళా బిల్లు ముసుగులో డీలిమిటేషన్ బిల్లు తెచ్చారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. బీజేపీ అక్రమంగా, అశాస్త్రీయంగా బిల్లు పాస్ చేసుకోవాలని చూసిందని, బిల్లు వీగిపోవడం మోదీకి చెంపపెట్టు వంటిదన్నారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేకంగా మహిళా బిల్లు పెడితే సంపూర్ణ మద్దతిసామన్నారు. అంతేగాని తిరకాసు పెట్టీ మహిళలను మోసం చేయాలని చూడొద్దని, మీరు పెట్టకపోతే 2029లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పెడతామన్నారు.
2023లో పెట్టిన మహిళా బిల్లును అమలు చేసి ఉంటే 2024లోనే 1/3 మహిళలు సభలోకి వచ్చేవారు కదా అన్నారు. బీజేపీ పార్లమెంట్‌లో ఒంటెద్దు పోకడకు పోవడంతో ప్రజాస్వామ్యం విజయం సాధించిందన్నారు. శనివారం గాంధీభవన్‌లో మహేష్‌కుమార్‌గౌడ్ మాట్లాడారు. ఉత్తర భారతదేశానికి ఎక్కువ దక్షిణానికి తక్కువ సీట్లు వచ్చే బిల్లును అడ్డుకోవడంలో ఖర్గే, రాహుల్, సోనియా, ప్రియాంకగాంధీలు సక్సెస్ అయ్యారన్నారు. బిల్లు వీగిపోవడం చూస్తే బీజేపీకి, ఎన్‌డీఏకు మహిళల పట్ల ఉన్న చిత్తశుద్ధి అర్థం అవుతుందన్నారు.
బిల్లు వీగిపోవాలనే డీలిమిటేషన్‌తో లింక్ పెట్టారన్నారు. తొలి మహిళ ప్రధాని, స్పీకర్, రాష్ట్రపతిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని, స్వాతంత్య్ర ఉద్యమంలో భాగస్వామ్యంలేని బీజేపీ ఒక్కసారైనా మహిళను జాతీయ అధ్యక్షురాలిని చేయలేదన్నారు. ఆర్‌ఎస్‌ఎస్, వీహెపీ, భజరంగ్‌దళ్, బీజేపీలు మహిళలకు అవకాశాలు ఇవ్వలేదని, ప్రధాని పచ్చి మోసగాడని మండిపడ్డారు. అబద్ధాలతో ప్రజలను మోసంచేసి నిందను వేరే వాళ్ళ మీద వేయాలని చూస్తున్నారని విమర్శించారు.
పాక్‌తో తెలంగాణను పోల్చితే తెలంగాణ ఎంపీలు నోరు మెదపలేదని నిలదీశారు. కిషన్‌రెడ్డి తన రాజకీయ జీవితంలో ఒక్క లీడర్‌ను కూడా తయారు చేశా రా? అని నిలదీశారు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో కిషన్‌రెడ్డి రాష్ట్రానికి ఏం చేశారో తెల్ల కాగితంపై విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దేశ స్వాతంత్య్రం, నిర్మాణంలో దక్షిణాది పాత్ర చాలా ఉందన్నారు. అప్పుడెప్పుడో సోనియా గాంధీపై రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను ఇప్పుడు రాజకీయం చేయడం తగదన్నారు.
ఓవైసీ జపం, శ్రీరాముడు పేరు చెప్పకుండా అభివృద్ధి పేరు చెప్పి కిషన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో గెలుస్తాడా? అని ప్రశ్నించారు. ప్రజలు అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారు తప్ప దేవుడి పేరు చెబితే ఓట్లు వేసే పరిస్థితిలో లేరన్నారు. తాము కేంద్రంలో అధికారంలోకి వచ్చాక హైబ్రిడ్ మోడల్ గుర్తించి ఆలోచిస్తామన్నారు.
పులి తిన్న మేకలు ఎన్నో బయటపెడతాం..
హరీష్ రావు వ్యాఖ్యలకు మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. పులి కష్టం ఫామ్‌హౌస్‌కి పరిమితమయ్యిందని ఎద్దేవా చేశారు. అదే 20వ తేదీన పులి తిన్న మేకలు ఎన్నో బయటపెట్టబోతున్నామని, ప్రాజెక్టులకు పులి ఎన్ని బొక్కలు పెట్టిందో బహిర్గతం చేస్తామన్నారు. ఆ పులిని చూసి పిల్లులు ఎగురుతున్నాయని, క్రాస్ బీడ్ వ్యవస్థ తెచ్చింది కేసీఆర్ కాదా? అని విమర్శించారు. మంత్రి వర్గ విస్తరణపై సీఎం సరైన సమాధానం ఇస్తారన్నారు.






