14-02-2026 12:23:14 AM
వికారాబాద్, తాండూర్ కొడంగల్లో స్పష్టమైన మెజార్టీ సాధించిన కాంగ్రెస్
పరిగిలో రసవత్తరంగా మారిన చైర్మన్ పీఠం
కొడంగల్ మినహా మూడు మున్సిపాలిటీలో గట్టి పోటీనిచ్చిన బీఆర్‌ఎస్
వికారాబాద్, ఫిబ్రవరి- 13: జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో హస్తం తన హవాను కొనసాగించింది. వికారాబాద్, తాండూర్, కొడంగల్ మున్సిపాలిటీలలో స్పష్టమైన మెజార్టీ సాధించి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్నాయి. వికారాబాద్ మునిసిపాలిటీలో మొత్తం 34 వార్డులు ఉండగా కాంగ్రెస్ 17 స్థానాలు కైవసం చేసుకుంది.
చైర్మన్ పీఠం అధిరోహించడానికి 18 స్థానాలు కావాల్సి ఉండగా 16 వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థి పుష్పలత శ్రీకాంత్ కాంగ్రెస్ లో కలవడంతో 18 స్థానాలకు చేరి స్పష్టమైన మెజార్టీని సాధించింది. తాండూరు మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా కాంగ్రెస్ 19 స్థానాలు సాధించి చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది.
కొడంగల్ మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా కాంగ్రెస్ 10 వార్డులను కైవసం చేసుకుని చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. పరిగి మునిసిపాలిటీలో 18 వార్డులు ఉండగా కాంగ్రెస్ 8 స్థానాలను దక్కించుకుంది. ఇక్కడ టిఆర్‌ఎస్ సైతం 8 స్థానాలు దక్కించుకోవడంతో ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు కీలకంగా మారారు. విజయం సాధించిన ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులలో ఒకరిని కాంగ్రెస్, ఒకరిని బీఆర్‌ఎస్ నాయకులు క్యాంపుకు తరలించినట్లు సమాచారం. పరిగి మున్సిపాలిటీలో ఇండిపెండెంట్ అభ్యర్థులు కీలకం కావడంతో చైర్మన్ పీఠం ఎంపిక రసవత్తరంగా మారింది.
గట్టి పోటీ ఇచ్చిన బీఆర్‌ఎస్
జిల్లాలోని తాండూర్ వికారాబాద్ పరిగి మున్సిపాలిటీలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చింది. తాండూర్, వికారాబాద్ లో చైర్మన్ పీఠానికి అవసరమైన సంఖ్య కంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ ఎక్కువ సాధించలేకపోయింది. పరిగిలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఏకంగా సవాలు విసిరింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్ మున్సిపల్ లో మాత్రం ఏకపక్షంగా కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక్కడ టిఆర్‌ఎస్ కేవలం ఒక సీటు మాత్రమే గెలుచుకుంది.
సత్తా చాటిన బీజేపీ
జిల్లాలోని తాండూర్, వికారాబాద్ మున్సిపాలిటీలలో బిజెపి సత్తాచాటింది. వికారాబాద్ మునిసిపల్ లో అనూహ్యంగా నాలుగు సీట్లను సాధించుకుంది. గత పాలకవర్గంలో కేవలం ఒక సీటు మాత్రమే ఉన్న బిజెపి ఇప్పుడు నాలుగు సీట్లకు పెరగడం అందరినీ ఆశ్చర్యాన్ని గురిచేసింది. తాండూరు మున్సిపాలిటీలో 3 సీట్లను కమలం కైవసం చేసుకుంది.
ఉనికి చాటుకున్న ఎంఐఎం
మునిసిపల్ ఎన్నికల్లో ఎంఐఎం సైతం తమ ఉనికిని చాటుకుంది. తాండూరులో 1, వికారాబాద్ లో 1, కొడంగల్ లో 1 స్థానాలు విజయం సాధించింది.