24 April, 2026 | 2:40 AM

కారు జోరు!

24-04-2026 01:14 AM
  1. ప్రభుత్వంపై అసంతృప్తిని అజెండా చేసుకున్న బీఆర్‌ఎస్ 
  2. పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా వ్యూహం
  3. అన్ని వర్గాల్లోని విముఖతను అనుకూలంగా మార్చుకునే యోచన 
  4. కేసీఆర్ జగిత్యాల సభతో పార్టీలో పెరిగిన జోష్ 
  5. త్వరలో అన్ని జిల్లాల్లో పార్టీ అధినేత సభలకు ప్రణాళిక

హైదరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి) : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను సమీక్షించిన బీఆర్‌ఎస్ పార్టీ, ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తినే ప్రధాన అజెండాగా మలుచుకుని ముం దుకు సాగుతున్నది. వివిధ వర్గాల్లో కనిపిస్తున్న విముఖతను గమనించి, దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే వ్యూహరచన చేస్తున్నది. పాలనలో కనిపిస్తున్న లోపాలు, హామీల అమలులో జాప్యం, రైతులు, ఉద్యోగులు, మహిళలు, యువతలో పెరుగుతున్న అసంతృప్తిని ప్రధాన అంశాలుగా మార్చుకుని ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ఎండగట్టాలని యోచిస్తున్నది.

గ్రామస్థాయి నుంచి పట్టణస్థాయి వరకు ఈ అంశాలను చర్చకు తీసుకువచ్చి, ప్ర భుత్వంపై పోరాటాన్ని బలోపేతం చేయడంపై దృష్టిపెట్టింది. ఇటీవల జగిత్యాల లో బీఆర్‌ఎస్ పార్టీ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ విజయవంతం కావడం తో కేడర్‌లో ఉత్సాహం పెరిగింది. దీనిని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడంపై బీఆర్‌ఎస్  దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలో నేత్వరలో అన్ని జిల్లాల్లో వరుసగా సభలు నిర్వహి స్తూ ప్రభుత్వంపై నేరుగా రాజకీయదాడి చేసేందుకు బీఆర్‌ఎస్ సిద్ధమ వుతోంది.

ప్రభుత్వంపై పెరుగుతున్న వ్య తిరేకతను కొనసాగించేందుకు బీఆర్‌ఎస్ మరింత దూకుడుగా వ్యవహరించే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రజల సమస్యలను నేరుగా హైలైట్ చేస్తూ, గత పాల నతో పోలికలు చూపించడం ద్వారా తన బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది.

అంతేకాకుండా అన్ని వర్గాల్లోని అసంతృప్తిని ఒకే రాజకీయ దిశగా మళ్లించడం ద్వారా ఓటు బ్యాంకును బీఆర్‌ఎస్ వైపు తిప్పుకునే లక్ష్యం తో వ్యూహాలు రూపొందిస్తోంది. క్షేత్రస్థాయిలో కేడర్‌ను బలోపేతం చేస్తూ, ప్రజల్లోకి బలమైన సందేశం తీసుకెళ్లేలా ప్రణాళికలు సిద్ధంచేస్తోంది.

అసంతృప్తినిపై వ్యూహం..

గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు స్థానిక సమస్యలతో పాటు రాష్ట్రస్థాయి పాలన వైఫల్యాలను ప్రజలకు వివరించేలా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు రూపొందిస్తున్నట్లు సమాచారం. రైతు సమస్యలు, ఉద్యో గుల అసంతృప్తి, సంక్షేమ పథకాల అమలులో ఆలస్యం వంటి అంశాలను ప్రధానం గా ఎత్తిచూపేలా పార్టీ దృష్టిపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఒక్కోవర్గంలో ఒక్కో కార ణంతో ప్రభుత్వంపై  వ్యతిరేకత పెరుగుతుం ది.

ఈ పరిస్థితులను వచ్చే ఎన్నికల సమయానికల్లా తమకు అనుకూలంగా మలుచు కోవాలని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాచరణ రూ పొందింస్తున్నది. రైతులకు ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగులకు పెండింగ్ సమస్యలు, మహిళలకు సంక్షేమ పథకాల అమలులో జాప్యం, యువతలో ఉద్యోగ అవకాశాలపై అనిశ్చితి వంటి అంశాలను ప్రధానంగా ఎత్తిచూపాలని యోచిస్తున్నది. గతంలో బీఆర్ ఎస్ ప్రభుత్వం అమలుచేసిన పథకాలు, అభివృద్ధి పనులను ఉదాహరణలుగా చూపిస్తూ మళ్లీ ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుకోవాలని చూస్తోంది. 

అన్ని జిల్లాల్లో కేసీఆర్ సభలు... 

ఇటీవల జగిత్యాలలో నిర్వహించిన కేసీఆర్ సభ విజయవంతం కావడంతో బీఆర్‌ఎస్ పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చింది. భారీగా తరలివచ్చిన ప్రజలు, బీఆర్‌ఎస్ శ్రేణుల్లో కనిపించిన చైతన్యం పార్టీలో ఆత్మవిశ్వాసాన్ని అందించినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సభలో కేసీఆర్ ప్రసంగం పార్టీ కేడర్‌ను మళ్లీ యాక్టివ్ చేయడంలో కీలకపాత్ర పోషించిందని భావిస్తు న్నారు. ప్రస్తుత ప్రభుత్వంపై చేసిన విమర్శలు, గత పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ప్రస్తావన పార్టీ శ్రేణుల్లో జోష్ పెంచాయి.

ఈ సభ సక్సెస్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి భారీ సభలను నిర్వ హించాలనే దిశగా బీఆర్‌ఎస్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే అన్ని జిల్లాల్లో వరుసగా కేసీఆర్ సభలు నిర్వహించాలనే దిశగా పార్టీ నాయకత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలుస్తోం ది. ప్రతి జిల్లాలో స్థానిక సమస్యలను కేం ద్రంగా తీసుకుని, ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని ప్రజల్లో బలంగా ప్రతిబింబించేలా ఈ సభలను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

బూత్‌స్థాయి నుం చి జిల్లాస్థాయి వరకు సమన్వయం చేస్తూ ప్రతి సభను విజయవంతం చేయాలనే దిశ గా ప్రత్యేక టీంలను నియమించే యోచనలో ఉంది. ఈ సభల ద్వారా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనను పోల్చడంతోపాటు ఆయా పథకాల అమలులో ప్రభుత్వ వైఫల్యాలను హైలైట్ చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ వరుస సభలతో బీఆర్‌ఎస్ రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ తన ఉనికిని బలంగా చాటుకో వాలని చూస్తోం ది. కేడర్లో వచ్చిన ఉత్సాహాన్ని కొనసాగిస్తూ, ప్రజల్లో బలమైన రాజకీయ సందేశం వెళ్లేలా పార్టీ వ్యూహం అమలుకానుంది.