ధాన్యం ఆరబెట్టాకే కేంద్రాలకు తీసుకురండి
కలెక్టర్ కే.హైమవతి
నంగునూరు, ఏప్రిల్ 23: రైతులు వరి ధాన్యాన్ని వ్యవసాయ క్షేత్రాల వద్దే నిర్ణీత తేమ శాతం వచ్చే వరకు ఆరబెట్టిన తర్వాతే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి కోరారు. గురువారం నంగునూరు మండలం పాలమాకుల, చిన్నకోడూరు మండలం గోనెపల్లి, పెద్ద కోడూరు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్రాల్లో గన్ని బ్యాగులు, తేమ కొలిచే యంత్రాలు, కాంటాలు సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎండల దృష్ట్యా రైతులకు తాగునీటి సౌకర్యం కల్పించాలని, అకాల వర్షాల నుంచి ధాన్యాన్ని రక్షించుకోవడానికి టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ధాన్యం సేకరణలో జాప్యం లేకుండా చూడాలని, తేమ శాతం రాగానే వెంటనే మిల్లులకు లోడ్ చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. రైతులు రాత్రి వేళల్లో ధాన్యం పై కవర్లు తప్పనిసరిగా కప్పి ఉంచాలని ఆమె విజ్ఞప్తి చేశారు.






