ఆంజనేయస్వామి ఆలయంలో అమావాస్య వేడుకలు
వనపర్తి మండలం, జూలై 14: వనపర్తి మండలం అచ్యుతాపురం గ్రామంలోని గుంటి పంచముఖి ఆంజనేయస్వామి ఆలయంలో అమావాస్య సందర్భంగా మంగళవారం ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం స్వామివారికి పంచామృతాభిషేకం, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, నవగ్రహ పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తికి ప్రత్యేక అభిషేకాలు, పల్లకీ సేవ, మహామంగళహారతి నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా బోయిని బాలయ్యఅలివేల దంపతుల ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ నిర్వహించగా, శాశ్వత అన్నదాన కార్యక్రమానికి పలువురు భక్తులు రూ.11,116 చొప్పున విరాళాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ అధ్యక్షుడు రమేష్ శర్మ, ఆలయ పూజారి నవీన్ శర్మ, గ్రామ సర్పంచ్ శాంతయ్య, మాజీ మార్కెట్ చైర్మన్ శ్రీనివాసులు గౌడ్, ఉప సర్పంచ్ శారద, మాజీ సర్పంచ్ శివశంకర్ రెడ్డి తదితరులతో పాటు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.






