15 July, 2026 | 12:34 AM

8 వేల కోట్లు విడుదల చేయాలి

15-07-2026 12:34 AM
  1.   14 లక్షల మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాలి
  2. జీవో 9ని రద్దు చేసి, పాత విధానాన్ని కొనసాగించాలి
  3. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య
  4. ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద సత్యాగ్రహ దీక్ష
  5. హర్యానా మాజీ గవర్నర్ దత్తాత్రేయ మద్దతు
  6. వేలాదిగా తరలివచ్చిన విద్యార్థులు

ముషీరాబాద్, జూలై 14 (విజయక్రాంతి): రాష్ర్టంలో 14 లక్షల మంది కాలేజీ విద్యార్థుల ఫీజుల బకాయిలు 8 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ పథకాన్ని ఎత్తివేయాలనే కుట్రలు మానుకోవాలని హెచ్చరించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని  యధాతథంగా అమలు చేయాలని, 8 వేల కోట్ల ఫీజు బకాయిలను వెంటలే చెల్లించాలని  డిమాండ్ చేస్తూ మంగళవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఆర్ కృష్ణయ్య సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.

రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది విద్యార్థులు తరలివచ్చారు. 96 బీసీ కుల సంఘాలు, 40 బీసీ సంఘ నేతలు మద్దతుగా దీక్షలో కూర్చున్నారు. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ మధుసూదన్ చారి, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హాజరై దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. ఫీజుల బకాయిలు విడుదల చేయకుంటే బీసీల తిరుగుబాటు తప్పదన్నారు.

బీసీలకు ఇప్పటికే మంత్రివర్గంలో, నామినేటెడ్ పోస్టులు, బడ్జెట్ కేటాయింపులో అన్యాయం చేశారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి ఒక కొత్త స్కీం కూడా బీసీలకు పెట్టలేదని, కొనసాగుతున్న స్కీములను రద్దుచేసే కుట్ర చేస్తున్నాడని మండిపడ్డారు.  రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తుందని మండిపడ్డారు. పేద కులాలు చదువుకోకుండా కుట్రలు చేస్తున్నారన్నారు.

ఉన్నత విద్య ప్రమాణాలతో బలహీన వర్గాల జీవితాల మార్పు అభివృద్ధి చేస్తున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకులాలను రద్దు చేసే కుట్రకు తెర తీస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు ఇలా ప్రజా వ్యతిరేక బీసీ, ఎస్సీ, ఎస్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారో ఎవరికీ అంతుచిక్కడం లేదన్నారు. గత 76 సంవత్సరాలుగా అగ్రకులాలే సీఎంలు, మీరే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజ్యమేలారన్నారు. దేశాన్ని దేశ సంపదన దోచుకున్నారని ఆరోపించారు.

ఇప్పుడు బీసీ లు చదువుతుంటే కూడా ఓ్ంవలేకపోతున్నారని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ ను ఎత్తేసే కుట్రలు చేస్తే రాష్ట్రాన్ని దిగ్బంధిస్తామని ఆయన హెచ్చరించారు.  బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ మధుసూదనాచారి మాట్లాడుతూ.. ఫీజు బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతుందని అన్నారు.

అందాల పోటీలకు,  మూసి ప్రక్షాళనకు వేలకోట్లు కేటాయిస్తూ విద్యార్థుల ఫీజు బకాయిలను చెల్లించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు కేటాయించాలని అన్నారు. పెండింగ్ ఫీజు బకాయిలను తక్షణమే చెల్లించి  డిమాండ్ చేశారు.

ఈ సత్యాగ్రహ దీక్షలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ అరుణ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పగిళ్ల సతీష్ కుమార్, కన్వీనర్ పల్లగొర్ల రాందేవ్ యాదవ్, బీసీ ఐక్య కులాల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు జి.  అనంత య్య, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షు డు జిల్లపళ్లి అంజి, బీసీ సంఘం నేతలు గుజ్జ కృష్ణ, నిఖిల్ పటేల్, చిక్కుడు బాలయ్యలతో పాటు వేలాది మంది విద్యార్థులు పెద్ద సంఖ్య లో హాజరై మద్దతు తెలిపారు.