నేటి నుంచి టీజీ ఎప్‌సెట్
- నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
- అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలకు 106 సెంటర్లు ఏర్పాటు
- ఒక్కో షిఫ్ట్‌లో 30 వేలకు పైగానే అభ్యర్థులు
హైదరాబాద్, మే 3 (విజయక్రాంతి): టీజీ ఎప్‌సెట్- పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలకు నిమిషం నిబంధన అమలు చేస్తున్నారు. సోమవారం, మంగళవారం అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 106 సెంటర్లను ఏర్పాటు చేశారు. మొత్తం మూడు సెషన్‌లలో ఈ పరీక్షలు జరగనున్నాయి.
ఒక్కో సెషన్‌లో 30 వేల మందికిపైగా మూడు సెషన్‌లో కలిపి మొత్తం 90,958 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. సోమవారం రెండు సెషన్స్, 5న ఉదయం సెషన్‌లో పరీక్షలు జరగనున్నాయి. ఉదయం సెషన్ ఉదయం 9 గంటల నుంచి 12 వరకు, మధ్యాహ్నం సెషన్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. ఉదయం 9 గంటలకు పరీక్ష రాసేవారిని 7:30 గంటల నుంచి, మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే సెషన్ వారిని 1:30 గంటల నుంచే హాల్లోకి అనుమతిస్తారు.
అభ్యర్థులు తమ హాల్ టికెట్‌తోపాటు ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డ్ మొదలైన వాటిలో ఏదేని ఒక ఒరిజినల్ ఐడీ కార్డును తెచ్చుకోవాలి. బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే వెంట తెచ్చుకోవాలి. మొబైల్ ఫోన్లు, కాలిక్యులేటర్లు, డిజిటల్ వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు.
పరీక్ష ముగిసిన వెంటనే అభ్యర్థులు సాధించిన మార్కులు కంప్యూటర్ స్క్రీన్‌పైనే కనిపించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే, తుది ర్యాంకులను మాత్రం నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారా నిర్ణయించి కేటాయిస్తారు. ఇదిలా ఉంటే ఇంజినీరింగ్ విభాగానికి ఈ నెల 9 నుంచి 11 వరకు పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే.






