మేడిపల్లిలో ఉద్రిక్త వాతావరణం
- ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం
- ఒకరిపై మరొకరు అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు
- చర్చకు రావాలంటూ మంచిరెడ్డి కిషన్ రెడ్డి సవాల్
- బీఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన
- ఆందోళనకారులను అరెస్టు చేసిన పోలీసులు
అబ్దుల్లాపూర్ మెట్, ఏప్రిల్ 17: మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఫార్మాసిటీ విషయంలో సవాల్ ప్రతి సవాళ్ల మధ్య యాచారం మండలం మేడిపల్లి గ్రామంలో శుక్రవారం ఉదయం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులను నెలకొన్నాయి. రంగారెడ్డి జిల్లా, యాచారం మండలం, మేడిపల్లి గ్రామంలో వందలాది పోలీసులు మోహరించారు.
ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఫార్మాసిటీ తో మంచిరెడ్డి కిషన్ రెడ్డి కోట్లు గడించారని అవినీతికి పాల్పడ్డారని అనడంతో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సైతం మీడియా సమావేశం నిర్వహించి తాను ఫార్మాసిటీ భూముల విషయంలో ఒక్క రూపాయి అవినీతికి పాల్పడితే ఆధారాలతో సహా నిరూపిస్తే రాజకీయాల్లో తప్పుకుంటానని, ఇంకా ఎమ్మెల్యే మల్ రెడ్డి తొర్రూరు పలు ప్రాంతాల్లో అనేక కబ్జాలు చేశారని తాను అన్ని బయటపెడతానని శుక్రవారం ఉదయం 9 గంటలకు మేడిపల్లిలో చర్చకు రావాలని ఎమ్మెల్యే మల్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు.
ఈ మేరకు నేడు శుక్రవారం మండల పరిధిలోని మేడిపల్లి, గ్రామానికి మాజీ ఎమ్మెల్యే తనయుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి, (బంటి) ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున చేరుకొని ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పోలీసులు అరెస్టు చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రశాంత్ రెడ్డిని బీఆర్‌ఎస్ పార్టీ నాయకులను అరెస్టు చేసి కందుకూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరి కొంతమంది కార్యకర్తలను ఇబ్రహీంపట్నం, మంచాల, మండలాల పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ఈ సందర్భంగా మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..... ఎమ్మెల్యే మల్ రెడ్డి గాంధీభవన్ లో కూర్చొని తమపై అవినీతి ఆరోపణలు గుప్పిస్తూ విమర్శలు చేస్తూ సవాల్ విసిరారని, దానికి ప్రతిగా తాము ఎవరు అవినీతికి పాల్పడ్డారో తేల్చుకొని చర్చ పెడదామని ప్రజలలోకి ధైర్యంగా మేడిపల్లికి వస్తే, ఎమ్మెల్యే భయపడి పారిపోయారు అన్నారు. ఫార్మాసిటీ రైతుల వద్ద మంచిరెడ్డి కిషన్ రెడ్డి అవినీతికి పాల్పడ్డ దాఖలాలు గాని ఒక్క రూపాయి తీసుకున్న సందర్భంగాలేదని తేల్చి చెప్పారు.
ధైర్యం ఉంటే మేడిపల్లి ప్రజల్లోనే బహిరంగంగా చర్చించాలని మరోసారి సవాల్ విసిరారు. ఈ అరెస్టులను ఖండిస్తూ బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కర్నాటి రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో యాచారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సవాళ్లు ప్రతి సవాళ్లు మధ్య ప్రశాంతంగా ఉన్న మండలంలో ఒక్కసారిగా రాజకీయం వెడెక్కింది. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు రాజేందర్ రెడ్డి, రాజు నాయక్, బద్రీనాథ్ గుప్తా,బహదూర్ నాయక్ , కాజు మహ్మద్ ,హబీ బుద్దీన్, ఎండి షమీం, జుట్టు శ్రీశైలం, కాసాని రవి గౌడ్, తదితరులు పాల్గొన్నారు.






