కూసుమంచిలో ఎస్‌ఐఆర్‌ను తనిఖీ చేసిన కలెక్టర్
- స్వీకరించిన ఫారాలను నిర్ణీత గడువులోగా డిజిటైజేషన్ చేయాలి ఆదేశం
- ఎస్‌ఐఆర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
ఖమ్మం, జూలై - 14(విజయక్రాంతి): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు ఓటర్లకు పంపిణీ చేసిన ఎన్యుమరేషన్ ఫారాలను సకాలంలో తిరిగి స్వీకరించి, నిర్ణీత గడువులోగా వాటి డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. మంగళవారం పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండల కేంద్రంలో శివాలయం వీధిలో బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. బూత్ స్థాయిలో ఫారాల పంపిణీ, స్వీకరణ, డేటా ఎంట్రీ, డిజిటలైజేషన్ పనుల పురోగతిని తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ, ఫారాలు పంపిణీ చేయడమే కాకుండా వాటిని పూర్తిగా పూరింపజేసి తిరిగి స్వీకరించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఒక్కో ఫారం డేటా ఎంట్రీకి ఎక్కువ సమయం పడుతున్న ప్రాంతాల్లో అవసరమైన అదనపు సిబ్బందిని వినియోగించి పెండింగ్ తగ్గించాలని అన్నారు. ప్రతి ఇంటిని సందర్శిస్తూ అర్హులైన ప్రతి ఓటరిని గుర్తించి, ఒక కుటుంబంలో ఒకరి మ్యాపింగ్ పూర్తయితే మిగిలిన అర్హులైన సభ్యులందరికీ కూడా మ్యాపింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ నెల 24వ తేదీలోగా డిజిటలైజేషన్ ప్రక్రియను పూ ర్తి చేయాల్సి ఉన్నందున, సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేసి జిల్లాలో ఎస్‌ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేయాలని కలెక్టర్ తెలిపారు. అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించే లక్ష్యంతో ఓటరు జాబితా సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ తనిఖీలో కూసుమంచి తహసీల్దార్ సైదులు, సూపర్వైజర్లు, బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు), సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.






