15 July, 2026 | 12:47 AM

తుమ్మల చెరువుకు నీళ్లు ఇవ్వకుంటే రైతాంగ పోరాటం తప్పదు

15-07-2026 12:47 AM
  1. మారెళ్లపాడుసీతారామ ప్రాజెక్టును పరిశీలించనున్న మిత్రపక్ష నాయకులు
  2. ఎల్నినో ప్రభావంతో ఎండిపోతున్న నారుమళ్లను సందర్శించిన నాయకులు

అశ్వాపురం, జూలై 14 (విజయక్రాంతి):  ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక అశ్వాపురం మండలంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తుమ్మల చెరువు కింద సాగు చేసే రైతులకు వెంటనే సీతారామ ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేయాలని మిత్రపక్ష నాయకులు డిమాండ్ చేశారు. మొండికుంట గ్రామంలో మంగళవారం నిర్వహించిన మిత్రపక్షాల సమావేశంలో వారు మాట్లాడుతూ, గతంలో అధికార పార్టీ నాయకులు, మంత్రులు మారెళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా తుమ్మల చెరువుకు నీటిని అందించి ఆయకట్టు రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చినా, నేటికీ పనులు నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు.

సీతారామ ప్రాజెక్టు నీరు అశ్వాపురం మండలం మీదుగా ఇతర ప్రాంతాలకు తరలిస్తుండగా, ప్రాజెక్టుకు సమీపంలో ఉన్న తుమ్మల చెరువును మాత్రం నింపకపోవడం రైతుల పట్ల తీవ్ర నిర్లక్ష్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రైతుల అవసరాలను పక్కనపెట్టి ఇతర ప్రాంతాలకు నీటిని మళ్లించడం సమంజసం కాదన్నారు. ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని‘ అన్న చందంగా సీతారామ ప్రాజెక్టు పక్కనే ఉన్న రైతులకు సాగునీరు అందకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.

సమావేశం అనంతరం మిత్రపక్ష నాయకులు మొండికుంట గ్రామంలోని వరి నారుమళ్లను పరిశీలించారు. వర్షాలు లేక నారుమళ్లు ఎండిపోతున్న దృశ్యాలను చూసి రైతుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల పంటలు కాపాడాలంటే తక్షణమే తుమ్మల చెరువుకు నీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో రైతు సంఘం నాయకులు సర్గం బాలనర్సయ్య, బద్దం శాంబిరెడ్డి, టీజేఎస్ నాయకులు కరుణాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు చావా రాఘవులు, తూము చిన్న రాఘవులు,సీపీఐ నాయకులు దంతాల జగదీష్, దండి నాగేశ్వరరావు,  మామిడి శ్రీను తదితర మిత్రపక్షాల నాయకులు, రైతులు పాల్గొన్నారు.