అపోలో ఆస్పత్రిలో అత్యాధునికి చికిత్స
అకాలేషియా కార్డియా బాధితులకు ఉపశమనం
హైదరాబాద్, జూలై 14 (విజయక్రాంతి): అకాలేషియా కార్డియా అనే అరుదైన ఆహారనాళ వ్యాధితో బాధపడుతున్న రోగులకు సికింద్రాబాద్ అపోలో ఆస్పత్రిలో అత్యాధునిక పెర్ ఓరల్ ఎండోస్కోపిక్ మయోటమీ (పోఎం) విధానంతో విజయవంతంగా చికిత్స అందించినట్లు కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు డాక్టర్ భాస్కర్, డాక్టర్ వేణు గొంగాటి తెలిపారు.
డాక్టర్ భాస్కర్ మాట్లాడుతూ.. కోవిడ్ అనంతరం అకాలేషియా కార్డియా కేసులు పెరుగుతున్నాయని, మింగడంలో ఇబ్బంది, ఛాతినొప్పి, తిన్న ఆహారం తిరిగి నోటికి రావడం, బరువు తగ్గడం వంటి లక్షణాలతో రోగులు వస్తున్నారని చెప్పారు. డాక్టర్ వేణు గొంగాటి మాట్లాడుతూ, వరంగల్కు చెందిన విజయలక్ష్మి (37) పదేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతుండగా, గతంలో చేసిన చికిత్స ఫలితం ఇవ్వకపోవడంతో పోఎం విధానాన్ని అమలు చేసి విజయవంతంగా కోలుకునేలా చేశామని తెలిపారు.
అలాగే కరీంనగర్‌కు చెందిన రవీందర్ (50)కు గుండె సంబంధిత సమస్యలు ఉన్నప్పటికీ సంప్రదాయ శస్త్రచికిత్సకు బదులుగా పోఎం విధానంతో విజయవంతంగా చికిత్స అందించామని వెల్లడించారు. ఎలాంటి బాహ్య కోతలు లేకుండా ఎండోస్కోప్ ద్వారా నిర్వహించే ఈ చికిత్సతో రోగులు త్వరగా కోలుకుని మరుసటి రోజే ఇంటికి వెళ్లే అవకాశం ఉంటుందని డాక్టర్ భాస్కర్, డాక్టర్ వేణు గొంగాటి తెలిపారు. అత్యాధునిక సాంకేతికతతో ప్రపంచ స్థాయి గ్యాస్ట్రోఎంటరాలజీ సేవలను అందించేందుకు అపోలో ఆస్పత్రులు, సికింద్రాబాద్ కట్టుబడి ఉన్నాయని వారు పేర్కొన్నారు.






