15 July, 2026 | 12:46 AM

మిల్చి మిల్క్‌తో ప్రభుత్వ డెయిరీలు నాశనం

15-07-2026 12:46 AM

బెదిరించి నారాయణ, శ్రీచైతన్యలకు పాల అమ్మకం

హరీష్‌రావుపై ప్రభుత్వ విప్ అయిలయ్య ఫైర్

హైదరాబాద్, జూలై 14 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ హయంలో సర్వనాశనమైన విజ య, మదర్ డెయిరీలను తమ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని, మిల్చి మిల్క్ పేరుతో ప్రభు త్వ డెయిరీలను హరీష్‌రావు సర్వనాశనం చేశారని, దీనిపై బహిరంగ చర్చకు సిద్దమా? అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సవాల్ విసిరారు. హరీష్ రావు డైవర్షన్ రాజకీయాలు ప్రజలు నమ్మరని, ఆయన్ను ప్రజలు రాళ్లతో కొట్టే రోజులు వస్తాయని అయిలయ్య మండిపడ్డారు. తెలంగాణలో ప్రజాపాలన కొనసాగుతోంది.

పదేళ్లలో ధ్వంసమైన తెలంగాణను సీఎం రేవంత్‌రెడ్డి ముందుకు తీసుకెళ్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తెలిపారు. అధికారం పోయిందన్న అక్కసుతో కేటీఆర్, హరీష్‌రావు కలిసి నీళ్ల పైన చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. మంగళవారం అయిలయ్య సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సైకిల్ మీద రబ్బరు చెప్పులతో తిరిగిన హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో తెలంగాణ సంపదను దోచుకుని కోట్లు సంపాదించాడని విమర్శించారు.

‘మిల్చి మిల్క్’ పేరుతో నారాయణ, శ్రీ చైతన్యకు హరీష్‌రావు పాలు అమ్ముకుంటున్నాడని అయిల య్య ఆరోపించారు. యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహా స్వామిపైన ఒట్టు పెట్టి నారాయణ, శ్రీ చైతన్యకు పాలు పంపిణి చేస్తున్నాడో లేదో హరీష్ రావు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మిల్చి మిల్క్‌లో హరీష్ రావు భార్య తన్నీరు శ్రీనిత పేరుతో కోట్లాది రూపాయల పెట్టుబడులున్నాయని, ఈ పెట్టుబడులు ఎక్కడికి నుంచి వచ్చాయో హరీష్ రావు చెప్పాలన్నారు. మిల్చి మిల్క్ కోసం ప్రభుత్వ రంగ డెయిరీలైన విజయ, మదర్‌లను సర్వనాశనం చేశారని ఆయన విమర్శించారు. కొన్ని ఆంధ్రా వాళ్ల విద్యా సంస్థలను బెదిరించి ఈ పాలు అమ్మడమే కాకుండా ప్రభుత్వ ఆస్పత్రులు, హాస్టల్స్, ఇతర సంస్థలకు ఇవే పాలు అమ్ముతున్నారని ఆరోపించారు.