24 June, 2026 | 1:26 AM

ఆలయ నిధులు ముట్టేది లేదు!

24-06-2026 12:32 AM

గుడుల ఆదాయం.. తిరిగి వాటి అభివృద్ధికే కేటాయింపు

తమిళనాడు సీఎం విజయ్ సంచలన నిర్ణయం

22న తన పుట్టినరోజు సందర్భంగా సంస్కరణలకు శ్రీకారం

హైదరాబాద్, జూన్ ౨౩ (విజయక్రాంతి): తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఈ నెల 22న తన పుట్టినరోజు సందర్భంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల నుంచి వచ్చే ఆదాయాన్ని, తిరిగి వాటి అభివృద్ధి పనులకే వెచ్చించాలని సంకల్పించారు. ఈ మేరకు ఇదే రోజు అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు.

అంతేకాదు.. గత డీఎంకే ప్రభుత్వం సుమారు రూ.246 కోట్ల ఆలయ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన 46 ప్రాజెక్టులకు సంబంధించిన పరిపాలనా అనుమతులను సైతం రద్దు చేశారు. రాష్ట్రంలో ఇటీవల అధికార పగ్గాలు చేపట్టిన టీవీకే ప్రభుత్వం భక్తుల మనోభవాలను గౌరవిస్తూ ఆలయాల పరిరక్షణకు, వాటి ప్రాధాన్యతకు పెద్దపీట వేయడం విశేషం. హిందూమత, ధర్మాదాయ, దేవాదాయ శాఖ (హెచ్‌ఆర్‌అండ్‌సీ) ద్వారా ఆలయ ఆదాయాలను ఉపయోగించి గతంలో చేపట్టాలనుకున్న పలు వాణిజ్య ప్రాజెక్టులను ప్రభుత్వం పక్కన పెట్టింది.

వీటిలో రూ. 115.77 కోట్ల విలువైన 29 కల్యాణ మండపాలు, రూ. 130.08 కోట్ల విలువైన 17 వాణిజ్య సముదాయాలు (కమర్షియల్ కాంప్లెక్స్లులు) ఉన్నాయి. 2024 25 మధ్య వీటికి అనుమతులు లభించినప్పటికీ, కాగితాల స్థాయి నుంచి పనులు ముందుకు సాగలేదు. ఆలయాల మిగులు నిధులను ఆదాయాన్ని ఆర్జించే వాణిజ్య వ్యాపారాలకు ఉపయోగించాలనే గత ప్రభుత్వాల విధానానికి భిన్నంగా, ప్రస్తుత ప్రభుత్వం ఆలయాల పవిత్రతను కాపాడేందుకు టీవీకే ప్రభుత్వం మొగ్గు చూపింది.

తమిళనాడు సీఎం విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హిందూ దేవాలయాల నిధులను సమర్థంగా వినియోగించడం, వాటిని కేవలం ఆలయాల పునరుద్ధరణకు, భక్తుల సంక్షేమానికి కేటాయించే స్ఫూర్తి ఇతర రాష్ట్రాల సీఎంలకూ ఆరద్శంగా నిలుస్తున్నది. కోర్టు స్టేలు, ఆలయాలపై పడుతున్న ఆర్థిక భారాన్ని పరిగణనలోకి తీసుకుని నిధులను కేవలం ఆలయాల నిర్వహణ, అన్నదానం, భక్తుల సౌకర్యాల వంటి ధార్మిక, ఆధ్యాత్మిక అవసరాలకే పూర్తిగా మళ్లించనున్నారు.

రాష్ట్రంలో దాదాపు 38,000 44,000 వరకు ఆలయాలు, వాటికి సంబంధించిన ఆస్తులను దేవాదాయ శాఖ పర్యవేక్షిస్తున్నది. అయితే.. వీటిలో మెజారిటీ ఆలయాలు సరైన నిధులు లేక ఇబ్బందులు పడుతున్నాయి. గత చారిత్రక గణాంకాల ప్రకారం వేలాది ఆలయాల వార్షిక ఆదాయం రూ.౫ వేల కంటే తక్కువగా ఉంది. కొన్ని చోట్ల నిత్య ధూపదీప నైవేద్యాలకు కూడా నోచుకోని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ఈ వ్యూహాత్మక మార్పు నిధులు లేని చిన్న ఆలయాల జీర్ణోద్ధరణకు, పూజల నిర్వహణకు ఊతం ఇవ్వనుంది. 

హేతుబద్ధతపైనా సమీక్ష

ఆలయాల ఆర్థిక పరిస్థితులు, చట్టపరమైన అడ్డంకులను హేతుబద్ధంగా సమీక్షించిన తర్వాతే ప్రభుత్వం ఈ ఆమోదాలను రద్దు చేస్తూ జీవో జారీ చేసింది. క్షేత్రస్థాయి అవసరాలకు ఏమాత్రం సరిపోలని వాణిజ్య నిర్మాణాల కంటే, భక్తుల ప్రాథమిక అవసరాలకే ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులు స్పష్టం చేశారు. ఉదాహరణకు రోజుకు కేవలం 500 మంది భక్తులు మాత్రమే వచ్చే కూనూర్ లోని ఒక చిన్న వినాయకుడి ఆలయం సమీపంలో బహుళ అంతస్తుల (మల్టీ-లెవెల్) పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మించా లనుకోవడం లాంటి అహేతుక నిర్ణయాలను ప్రభుత్వం సరిదిద్దింది.

ఆలయ ఆస్తులను ఇతర అవసరాలకు మళ్లించకూడదనే మద్రాస్ హైకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నిధులను పవిత్రమైన, ధార్మిక ప్రయోజనాలకే ఉపయోగించనున్నారు. గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ కూడా గతంలో ఆలయం కేంద్రంగా జరిపే వ్యయాలకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రద్దయిన ప్రాజెక్టుల ద్వారా మిగిలిన రూ.246 కోట్లను కొత్త వాణిజ్య నిర్మాణాలకు కాకుండా ఆలయాల ప్రాథమిక సౌకర్యాల మెరుగుదల కోసం కేటాయిస్తారు.

భక్తుల కానుకలు, హుండీ కలెక్షన్ల ద్వారా వచ్చే ఆదాయం దుర్వినియోగం కాకుండా పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వ వర్గాలు కట్టుబడి ఉన్నాయి. ఈ నిర్ణయం తమిళనాడు అసెంబ్లీలో తీవ్ర చర్చకు దారితీసినప్పటికీ, ప్రభుత్వం ఆలయాల హక్కుల పరిరక్షణ వైపే నిలబడింది. ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌తో సహా డీఎంకే నాయకులు టీవీకే ప్రభుత్వంపై రాజకీయ కక్షసాధింపుతో తీసుకున్న నిర్ణయమనే ఆరోపణలు చేశారు.

ఆలయాల విషయంలో తమిళనాడు ప్రభుత్వం కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లాగే వ్యవహరిస్తోందని స్టాలిన్ విమర్శించారు. ఈ ప్రాజెక్టుల వల్ల భక్తులకు మౌలిక వసతులు లభించడంతో పాటు ఆలయాలకు ఆర్థికంగా లాభం చేకూరుతుందని డీఎంకే సమర్థించుకుంది. దీనిపై దేవాదాయ శాఖ మంత్రి ఎస్.రమేష్ స్పందిస్తూ గత ప్రభుత్వ విధానాల లోపాలను గట్టిగా ఎండగట్టారు.

ఆలయ నిధులను వాణిజ్య పరమైన అవసరాలకు మళ్లించడం, అధిక పరిపాలనా ఖర్చుల వల్ల ఈ వ్యవస్థ దెబ్బతింటున్నదని, మరోవైపు ఆలయ భూముల ఆక్రమణలు, నిర్వహణా లోపాలు పెరిగిపోతున్నాయని ఆయన వివరించారు. ఆలయ నిధుల దుర్వినియోగానికి, కుంభకోణాలకు అడ్డుకట్ట వేసేందుకు ఇది ఒక మంచి అడుగు అని పేర్కొంటూ బీజేపీ సహా ఆలయ హక్కుల కార్యకర్తలు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఒకే ఒక్క నిర్ణయంతో ఆగిపోకుండా ఆలయ ఆస్తులపై సమగ్ర ఆడిటింగ్ నిర్వహించి మరిన్ని సంస్కరణలు తీసుకువస్తామని టీవీకే ప్రభుత్వం సూచించింది. 

చిన్న ఆలయాలను అభివృద్ధి చేయాలనే డిమాండ్

పురాతన నిర్మాణాలకు, కోట్ల మంది భక్తుల నమ్మకాలకు నిలయమైన తమిళనాడులో ప్రజా ధార్మిక సంస్థల నిధులు కేవలం ఆధ్యాత్మిక, సాంస్కృతిక పరిరక్షణకే పరిమితం కావాలనే విజయ్ ప్రభుత్వ నినాదానికి ప్రజల నుంచి విస్తత మద్దతు లభిస్తున్నది. భక్తులు దేవుడికి సమర్పించే కానుకలను లౌకిక లేదా వాణిజ్య కార్యకలాపాలకు మళ్లించడం దుర్వినియోగమేనని భావించే భక్తుల నమ్మకాలను ఈ టీవీకే ప్రభుత్వం నిలబెట్టింది.

చిన్నపాటి మిగులు నిధులనైనా సరైన పద్ధతిలో మళ్లిస్తే ఆలయాల పునరుద్ధరణ, చారిత్రక వారసత్వ సంరక్షణ, యాత్రికుల వసతుల కల్పనకు ఎంతో మేలు జరుగుతుందని ఆ ప్రభుత్వం భావిస్తున్నది. గత ప్రభుత్వాల నివేదికల ప్రకారం.. ఆలయాల్లో పూజలు, ఇతర పథకాల కోసం ప్రభుత్వ నిధులపై ఆధారపడాల్సి రావడం చూస్తే కేవలం వ్యాపారపరమైన సమస్యలు తీరవని స్పష్టమవుతుంది.

తాజాగా ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్న ఈ చొరవను అభినందిస్తూనే, ధార్మిక, ఆధ్యాత్మిక సంఘాల నేతలు సంపన్న ఆలయాల నుంచి వచ్చే మిగులు నిధులను, కనీస పూజలు కూడా చేసుకోలేని స్థితిలో ఉన్న పేద ఆలయాల పోషణకు ఉపయోగించాలని సూచిస్తున్నారు. గతంలో ఆలయాలు జ్ఞాన కేంద్రాలుగా, సామాజిక కార్యకలాపాలకు వేదికలుగా ఉండేవని, కాబట్టి వాటిని మళ్లీ ఉత్కృష్ట కేంద్రాలు (సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్)గా తీర్చిదిద్దాలని కోరుతున్నారు.

ఈ విధానం మెరుగైన నిర్వహణకు, పరిపాలనా పరమైన అవినీతిని తగ్గించేందు, భక్తులకు నిజమైన సౌకర్యాలను అందించేందుకు ఎంతవరకు ఉపయోగపడుతుందనే దానిపైనే ఈ నిర్ణయం విజయం ఆధారపడి ఉంటుంది. ప్రజా ధార్మిక సంస్థల నిధులు విస్తృత సామాజిక, -ఆర్థిక అభివృద్ధికి సాధనాలుగా కాకుండా, కేవలం ఆధ్యాత్మిక, సాంస్కృతిక పరిరక్షణకే పరిమితం కావాలనే ప్రస్తుత ప్రభుత్వ చర్య భవిష్యత్తులో ఆలయాల పరిపాలనలో ఒక సరికొత్త అధ్యాయానికి నాంది కానుంది.