గ్రేటర్ వాసులకు గుడ్ న్యూస్
- ఐటీ, ఇండస్ట్రియల్ హబ్‌ల చెంతనే లక్ష ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు
- హర్షం వ్యక్తం చేస్తున్న నగరవాసులు
రంగారెడ్డి, జూన్ 23 (విజయక్రాంతి): మహానగరంలో సొంత ఇల్లనేది సగటు మధ్యతరగతి, పేద కుటుంబానికి ఒక కల. అద్దె ఇంట్లో ఉంటూ సంపాదనలో సగానికి పైగా ఇంటి అద్దెలకే తగలేస్తున్న వేలాది కుటుంబాలకు తెలంగాణ గృహ నిర్మాణ శాఖ తీపి కబురు అందించింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ భవన ప్రారంభోత్సవంలో భాగంగా త్వరలో పేదలకు తీపి కబురు అందించనున్నామని....లక్ష ఇండ్లు నిర్మిస్తామంటూ ప్రజలకు హామీలు ఇచ్చారు.
సీఎం హామీ మేరకు గృహ నిర్మాణ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసే పనులు ప్రస్తుతం నిమగ్నమయ్యారు.కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్ ) పరిధిలో అల్పాదాయ, మధ్యతరగతి వర్గాల కోసం ఏకంగా లక్ష అఫర్డబుల్ ఇళ్ల (ఆఫర్థబుల్ హౌసింగ్ ) నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.గత అనుభవాల నుండి పాఠాలు నేర్చుకుంటూ, ఈసారి లబ్ధిదారులకు కేవలం ఇళ్లను మాత్రమే కాకుండా... ఉపాధిని, మెరుగైన జీవన ప్రమాణాలను కూడా ఉచితంగా అందించేలా ఈ ప్రాజెక్టును డిజైన్ చేయడం విశేషం. ఆదాయ వర్గాల వారీగా ఇళ్ల వర్గీకరణసమాజంలోని భిన్న వర్గాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ లక్ష ఫ్లాట్లను రెండు ప్రధాన విభాగాలుగా విభజించారు..
ఎల్.ఐ.జీ (ఎల్జీ -దిగువ ఆదాయ వర్గాలు): 70,000 ఫ్లాట్లు
ఎమ్.ఐ.జి (ఎమ్జ్జీ -మధ్య ఆదాయ వర్గాలు): 30,000 ఫ్లాట్లు
ప్రతి ఫ్లాట్ కనీసం 400 చదరపు అడుగుల ప్లింత్ ఏరియాతో, ఆధునిక వసతులతో (లిఫ్ట్, పార్కింగ్, తాగునీరు, సీవరేజ్ ప్లాంట్) కూడిన బహుళ అంతస్తుల టవర్ల రూపంలో నిర్మించనున్నారు.
‘దూరాభారం’ అనే ముద్రకు చెక్..!
గత ప్రభుత్వాల హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు లేదా హౌసింగ్ బోర్డు కాలనీలు నగరం దాటి 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉండేవి. ఫలితంగా రవాణా ఛార్జీలు భరించలేక, పిల్లల చదువులకు, వైద్య సదుపాయాలకు దూరమై చాలామంది లబ్ధిదారులు ఆ ఇళ్లల్లో చేరడానికి ఆసక్తి చూపలేదు.ఈ లోపాన్ని సవరిస్తూ, ప్రస్తుత ప్రభుత్వం ఐటీ కారిడార్లు , పారిశ్రామిక ప్రాంతాలకు అత్యంత సమీపంలోనే స్థలాలను ఎంపిక చేస్తోంది. అంటే.. పని చేసే చోటుకు కూతవేటు దూరంలోనే ఇళ్లు నిర్మించబోతున్నారు.
కేపీహెచ్‌బీ, లింగంపల్లిలో పైలట్ ప్రాజెక్ట్..
మొత్తం లక్ష ఇళ్ల ప్రాజెక్టులో భాగంగా మొదటి విడత కింద 12,000 ఫ్లాట్ల నిర్మాణానికి గృహ నిర్మాణ శాఖ అనుమతులు మంజూరు చేసింది.తెలంగాణ హౌసింగ్ బోర్డు సొంత నిధులతో పాటు, కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులను కూడా దీనికి జోడించనున్నారు.నగరంలో అత్యంత డిమాండ్ ఉన్న కేపీహెచ్బీ , బాలానగర్, చందానగర్-లింగంపల్లి వంటి ప్రైమ్ లొకేషన్లలో ఈ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది.జీహెచ్‌ఎంసీ,
సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధులను కలుపుతూ విస్తరించిన ‘క్యూర్’ రీజియన్లోని మూడు ప్రధాన జిల్లాల్లో స్థలాల గుర్తింపు ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజ్గిరి ప అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభుత్వ ఖాళీ స్థలాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఏ స్థలాల్లో ఎన్ని టవర్లు నిర్మించవచ్చనే దానిపై ఆర్కిటెక్ట్లు మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నారు.
త్వరలోనే డిమాండ్ సర్వే నోటి ఫికేషన్..
ఈ ఇళ్లకు ఎంతమంది అర్హులు ఉన్నారనేది తెలుసుకునేందుకు ప్రభుత్వం జూన్ నెలాఖరు లేదా జూలై మొదటి వారంలో ’డిమాండ్ సర్వే’ నోటిఫికేషన్ విడుదల చేయాలని భావిస్తోంది. ఈ సర్వే ఆధారంగానే అర్హులైన లబ్ధిదారుల నుండి దరఖాస్తులను స్వీకరించి, పారదర్శక పద్ధతిలో ఇళ్లను కేటాయిస్తారు.మొత్తానికి, నగరంలో సొంత గూడు లేని అల్పాదాయ, మధ్యతరగతి వర్గాల పాలిట ఈ ప్రాజెక్టు ఒక వరం కాబోతోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.






