24 June, 2026 | 2:28 AM

దశాబ్దాల కల సాకారం..

24-06-2026 12:51 AM
  1. ప్రారంభానికి సిద్ధమైన 50 పడకల కార్పొరేట్ స్థాయి ప్రభుత్వ ఆసుపత్రి
  2. ఎమ్మెల్యే కసిరెడ్డి ప్రత్యేక చొరవ 
  3. త్వరలో అందుబాటులోకి. 
  4. హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు 

అమనగల్లు, జూన్ 23(విజయక్రాంతి): నాలుగు మండలాల పేద ప్రజల ఆరోగ్య భరోసాకు సరికొత్త చిరునామా దొరికింది. ఒకప్పుడు వర్షం వస్తే కురిసే పైకప్పులు, మోకాళ్లోతు వరద నీటితో నరకప్రాయంగా మారిన అమనగల్లు ప్రభుత్వ ఆసుపత్రి స్థానంలో... ఇప్పుడు అధునాతన హంగులతో సరికొత్త భవనం ముస్తాబైంది.

జనాభా అవసరాలకు అనుగుణంగా రూ. 17.50 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన 50 పడకల నూతన ప్రభుత్వ వైద్యాలయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. మరో నెల రోజుల్లోనే ఈ భవనాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు రాత్రింబగళ్లు శ్రమిస్తున్నారు.

గతకాలపు కష్టాల నుంచి.. ఆధునిక వసతుల వైపు..

గతంలో అమనగల్లులోని పాత ఆసుపత్రి భవనం అరకొర వసతులతో, శిథిలావస్థకు చేరి రోగులను, వైద్య సిబ్బందిని తీవ్ర ఇబ్బందులకు గురిచేసేది. ముఖ్యంగా వానాకాలం వచ్చిందంటే చాలు భవనం జల్లెడలా మారి పైనుంచి నీరు కారేది. ఆవరణమంతా వరద నీరు చేరి రోగులు రావడానికే భయపడే పరిస్థితి ఉండేది. ఈ దుస్థితిపై స్థానిక స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు, ప్రజలు పెద్ద ఎత్తున చేసిన విన్నపాలు, పోరాటాల ఫలితంగా నూతన భవన నిర్మాణం అనివార్యమైంది.

రాజకీయాలతీతంగా అభివృద్ధి ప్రస్థానం..

ఈ ఆసుపత్రి నిర్మాణ ప్రయాణంలో ఎన్నో మలుపులు చోటుచేసుకున్నాయి.గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ భవనం కోసం రూ.17.50 కోట్లు మంజూరయ్యాయి. 2023 అక్టోబర్ 1న నాటి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావ్, స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్లు భూమిపూజ చేశారు. టెండర్లుపూర్తయినప్పటికీ, సాధారణ ఎన్నికల కోడ్ రావడంతో పనులు నిలిచిపోయాయి.

అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని, నిధులు యథాతథంగా కొనసాగేలా చూశారు. 2024 జూలై 10న పాత భవనాన్ని కూల్చివేసి, అదే స్థలంలో నూతన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.సరిగ్గా రెండేళ్ల రికార్డు కాలంలో నాణ్యతా ప్రమాణాలతో జీ ప్లస్ టూ  అంతస్తుల భవ్యమైన భవన నిర్మాణం పూర్తయింది.

నూతన ఆసుపత్రి ప్రత్యేకతలు:

కిడ్నీ బాధితుల కోసం ప్రత్యేకంగా 5 పడకలతో కూడిన డయాలసిస్ కేంద్రాన్ని ఈ భవనంలోనే ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల నిరుపేద రోగులు హైదరాబాద్ లేదా మహబూబ్నగర్ వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లే శ్రమ, ఖర్చు తప్పుతాయి. ఆసుపత్రికి అవసరమైన అత్యాధునిక వైద్య పరికరాలు, బెడ్లు, ల్యాబ్ సామాగ్రి ఇప్పటికే చేరుకున్నాయి.ప్రసూతి (గైనకాలజీ), జనరల్ మెడిసిన్, పిడియాట్రిక్స్ వంటి విభాగాల్లో నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉండనున్నారు. గతంలో ఎదురైన వరద నీటి సమస్య రాకుండా అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థ, సుందరమైన ఆవరణను తీర్చిదిద్దారు.

నలుగు మండలాల ప్రజలకు ‘సంజీవని..

ఈ సూపర్ స్పెషాలిటీ స్థాయి ఆసుపత్రి అందుబాటులోకి రావడం వల్ల కేవలం అమనగల్లు పట్టణానికే కాకుండా..చుట్టుపక్కల ఉన్న మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల్ మండలాల పరిధిలోని లక్షలాది మంది పేద, మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం అందనుంది. ఇప్పటికేభవన నిర్మాణం పనులు పూర్తి కాగా ప్రస్తుతం భవనానికి లోపల రంగులు వేస్తున్నారు. అతి త్వరలో దావఖాన నూతన భవనాన్ని ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని వైద్యులు తెలిపారు.