బిల్లులు రాక మాజీ సర్పంచ్ ఆత్మహత్య!
ఉరేసుకుని పిట్టల సంపత్బలవన్మరణం
ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత
కుటుంబ సభ్యుల ఆందోళన
సిద్దిపేట జిల్లా మహమ్మదాపూర్‌లో ఘటన
హుస్నాబాద్, జూన్23 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మహమ్మదాపూర్ గ్రామంలో మంగళవారం మాజీ సర్పంచ్ ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. పిట్టల సంపత్ తన పొలంలోని బావి వద్ద ఉరేసుకొని బలవన్మరణం పొందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంపత్ గతంలో రెండుసార్లు 2014, 2019లలో సర్పంచ్‌గా సేవలందించారు. ఈ క్రమంలో గ్రామాభివృద్ధి పనుల కోసం ఆయన సొంతంగా పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. ప్రభుత్వం నుంచి చేసిన పనులకు బిల్లులు రాక అప్పుల పాలయ్యాడు. అప్పుల వాళ్లు చెల్లించాలనడం.. ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడం తో పాలుపోని స్థితిలో పిట్టల సంపత్ తన వ్యవసాయ క్షేత్రం వద్ద ఉన్న ఓ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
ఇరుగుపొరుగు గమనించి పోలీ సులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోలీసులకు సంఘటనా స్థలంలో సూసైడ్ నోటు లభ్యమైందని సమాచారం. ఆ నోట్ లో నలుగురు తనకు వచ్చే బిల్లులు రాకుండా అడ్డుకుంటున్నారని.. సర్పంచ్, కార్యదర్శి, ఉప సర్పంచ్, వార్డు సభ్యుడు.. అని అందులో పేర్లు రాసినట్లుగా పోలీసులు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా సంపత్ అభివృద్ధి పనులకు సంబంధించిన రూ. 12 లక్షలు ఒక బిల్లు, 42 లక్షలకు పైగా మరొక బిల్లు వచ్చేది ఉండగా గ్రామపంచాయతీ పాలకవర్గం లోని కొందరు అడ్డుకున్నారని..ఆవేదన చెంది ఇటీవల ఆత్మహత్యకు సిద్ధమైన నేపథ్యంలో కుటుంబ సభ్యులు త్వరితగతిన స్పందించారని సమాచారం. దీంతో ప్రాణాపాయం తప్పిందని అనుకున్నప్పటికీ ౪ రోజుల వ్యవధిలోనే ఆయన ఆత్మహత్య చేసుకోవడం గ్రామస్తులను కలచివేసింది.
హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్, కోహెడ కొమురవెల్లి, అక్కన్నపేట ఎస్‌ఐలు పుల్ల అభిలాష్, తోట మహేష్ చాతరాజు, ప్రశాంత్ లు పిట్టల సంపత్‌ను పోస్టుమార్టం నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ నేపథ్యంలో విషయం తెలుసుక్ను హుస్నాబాద్, అక్కన్నపేట మండలాలకు చెందిన మాజీ సర్పంచ్‌లు, సర్పంచ్‌ల ఫోరం నాయకులు తోడేటి రమేష్ గద్దల రమేష్ అశోక్ రెడ్డి వెంకట్రామిరెడ్డి,రమణా రెడ్డి,మల్లిఖార్జున్ రెడ్డి తదితరులు ప్రభుత్వాసుపత్రి ఎదుట రోడ్డుపై కుటుంబ సభ్యులతో బైఠాయించి పెండింగ్ బిల్లులు చెల్లించి సంపత్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. మృతుని కొడుకు ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ శ్రీనివాస్ పేర్కొన్నారు.






